విరిగిన గేట్ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మంత్రి అనిల్ యాదవ్, విప్ ఉదయభాను, జిల్లా కలెక్టర్ నివాస్
సాక్షి, అమరావతి బ్యూరో, సాక్షి, అమరావతి, అచ్చంపేట, జగ్గయ్యపేట : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా డ్యాంలో నీటి నిల్వను తగ్గించాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ ఫ్లడ్ చేరింది. ఈ దృష్ట్యా అధికారులు, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. 16వ గేట్ వద్ద స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్‌లో నీటి నిల్వను తగ్గిస్తున్నారు. దీంతో నీటి విడుదల క్రమంగా 6 లక్షల క్యూసెక్కుల వరకు పెరగనుంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులో 34.68 టీఎంసీలు నిల్వ ఉండగా, సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 16వ నంబరు గేటు నుంచి పూర్తి స్థాయిలో, మిగతా గేట్ల నుంచి.. మొత్తంగా 5,05,870 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు తగ్గితేగాని మరమ్మతులు సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు.
మరమ్మతులకు మార్గం సుగమం
సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో ఊడిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ప్రాజెక్టులో క్రస్ట్ లెవల్ (గేటు బిగించే మట్టం) 36.34 మీటర్లకు నీటి నిల్వను తగ్గిస్తేనే.. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయవచ్చు. శుక్రవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 36.34 మీటర్లకు తగ్గుతుంది. అదే రోజు స్పిల్ వే 16, 17వ పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు) మధ్య స్టాప్ లాగ్ గేటును దించి.. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తామని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత పూర్తి స్థాయి గేటును బిగిస్తామని చెప్పారు.
ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతోనే..
నాగార్జునసాగర్ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 55,028 క్యూసెక్కులను విడుదల చేసిన తెలంగాణ అధికారులు.. దిగువకు వదిలే ప్రవాహాన్ని రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీలు నిల్వ ఉండటం... ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఏడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్పిల్ వే గేట్లను సంప్రదాయ పద్ధతి(రోప్)లో ఎత్తుతారు.
ఒక్కో గేటును ఎత్తేందుకు ఒక్కో వైపు రెండు చొప్పున, నాలుగు రోప్(ఇనుప తీగ)లను అమర్చారు. 16వ గేటును రెండు అడుగుల మేర ఎత్తగానే ఎడమ వైపున ఉన్న ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతో గేటు ఊడిపోయి, వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టు గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు.
నిపుణుల కమిటీ వేస్తాం..
ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ శ్రీనివాస్ తదితరులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయన కమిటీ ద్వారా ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇకపై ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామన్నారు. ఊడిపోయిన గేటును రేపు (శనివారం) సాయంత్రానికి పునరుద్ధరిస్తామని తెలిపారు.
మూడు నాలుగు రోజులుగా ఈ గేటు ద్వారానే ప్రాజెక్టు దిగువకు లక్ష నుంచి రెండు లక్షల నీటిని విడుదల చేశారని, తెల్లవారు జామున నీటి ప్రవాహ ఉధృతికి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గేటు ఊడినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరింత ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని గేట్ల ద్వారా 5,05,870 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నామని చెప్పారు. గేట్ అమర్చేందుకు పోలవరం నుంచి ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కూడా వస్తున్నారన్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నానిలు ప్రాజెక్టును సందర్శించి అధికారులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment