
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనులు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతితో ఒకే ప్యాకేజీ కింద ఈనెల 17వతేదీన రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరులోగా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి నవంబర్ నుంచి శరవేగంగా పనులు చేపట్టి రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం హెడ్‌వర్క్స్ గేట్ల పనుల నుంచి వైదొలగాలని ఇప్పటికే పోలవరం సీఈ నుంచి నోటీసులు అందుకున్న బీకెమ్ సంస్థ ఇప్పుడు తాము చేస్తున్న ధరల కంటే ఐదు శాతం తక్కువ రేట్లకే పనులు చేస్తామంటూ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. నామినేషన్‌పై రూ.387.56 కోట్ల విలువైన గేట్ల పనులు దక్కించుకున్న బీకెమ్ తాజాగా రూ.368.19 కోట్లకే చేస్తామని ప్రతిపాదించింది. తద్వారా గేట్ల పనుల్లో అవినీతి జరిగినట్లుగా బీకెమ్ పరోక్షంగా అంగీకరించినట్లయిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు సెక్యూరిటీ డిపాజిట్లు, తుది బిల్లులు తక్షణమే చెల్లించి, క్లెయిమ్‌ల పరిష్కారం(అదనపు పరిహారం) కోసం ఆర్బిట్రేషన్ (వివాద పరిష్కార మండలి) ఏర్పాటు చేస్తే పరస్పర అంగీకార విధానంలో కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధమని నోటీసులు అందుకున్న నవయుగ సంస్థ ప్రతిపాదించింది. అయితే కాంట్రాక్టు ఒప్పందంలో ఆర్బిట్రేషన్ అనే నిబంధన లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రూ.50 వేల కన్నా ఎక్కువ పరిహారానికి సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించాలనే నిబంధన మాత్రమే ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేస్తామంటూ నవయుగ, బీకెమ్‌లకు స్పష్టం చేసి కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసుకుని ‘రివర్స్ టెండర్’ నోటిఫికేషన్ జారీ చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.
పీపీఏకు నివేదించిన ఉన్నతాధికారులు
టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా నిర్థారించింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రివర్స్ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పరస్పర అంగీకార పద్ధతిలో ఈనెల 12లోగా తమను సంప్రదిస్తే తుది బిల్లులు చెల్లించి కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని నవయుగ, బీకెమ్‌కు జారీ చేసిన నోటీసుల్లో పోలవరం సీఈ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వివరించారు. ఈ నేపథ్యంలో రివర్స్ బిడ్డింగ్‌కు పీపీఏ అనుమతి ఇచ్చింది. మరోవైపు నవయుగతో పోలవరం జలవిద్యుదుత్పత్తి కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఏపీ జెన్‌కో అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.787.20 కోట్లను రికవరీ చేయాలని నిర్ణయించారు.
రూ.5,070.22 కోట్లతో రివర్స్ టెండర్..
పోలవరం హెడ్‌వర్క్స్, గేట్ల పనుల్లో సుమారు రూ.1,850 కోట్ల విలువైన పనులు మిగిలాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగ రూ.3,220.22 కోట్లకు దక్కించుకుంది. హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనులు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను ఒకే ప్యాకేజీ కింద కలిపితే అంచనా వ్యయం రూ.5,070.22 కోట్లు అవుతుంది. దీన్నే అంతర్గత అంచనా విలువగా నిర్ణయించి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దేశంలో కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), సోలార్ పవర్ కార్పొరేషన్‌లు మాత్రమే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తొలిసారిగా రాష్ట్రంలోనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో మొట్టమొదట పోలవరం పనులకు రివర్స్ టెండరింగ్ చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment