సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా హెడ్ వర్క్స్(జలాశయం) పనుల్లో నాణ్యత డొల్లేనని కేంద్ర నిపుణుల కమిటీ తేల్చింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించ లేదని స్పష్టంచేసింది. కనీసం షట్టరింగ్ పనులు కూడా సక్రమంగా చేయలేకపోయారని.. అందుకే స్పిల్ వేలోని పలు బ్లాక్‌లలో చీలికలు ఏర్పడ్డాయని పేర్కొంది. గోదావరికి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా ప్రాజెక్టును నిర్మిస్తుండటంవల్ల స్పిల్ వే (కాంక్రీట్ ఆనకట్ట) పటిష్టతను తేల్చడానికి నాన్–డిస్ట్రక్టివ్ టెస్ట్ (స్పిల్ వే పనుల నుంచి చిన్న కాంక్రీట్ ముద్దలను సేకరించి వాటిని పగులగొట్టి నాణ్యతను తేల్చడం).. టెన్సిల్ స్ట్రెంగ్త్ టెస్ట్ (తన్యత పటుత్వ పరీక్ష) చేసి నాణ్యతపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మట్టి రాయి పరిశోధన సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎస్)ను కోరింది. స్పిల్ వేతో పాటు పోలవరం పనుల్లో వినియోగించే సిమెంటు, స్టీల్, ఇసుక, కంకర వంటి వాటి నాణ్యతపై సీఎస్‌ఎంఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. అలాగే, స్పిల్ వేకు అమర్చే గేట్ల నాణ్యతను శాండ్ బ్లాస్టింగ్ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీఎస్‌ఎంఆర్‌ఎస్‌కు సూచించింది. అంతేకాక, స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు తలెత్తితే ప్రాజెక్టు భద్రతకు పెనుముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.
ఇదేనా చిత్తశుద్ధి?
పోలవరం ప్రాజెక్టును 2019 మార్చి నాటికి పాక్షికంగానూ డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో సాగుతున్న పనులను పరిశీలిస్తే ప్రాజెక్టును పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని నిపుణుల కమిటీ తేల్చింది. అందుకు ఉదాహరణలనూ వివరించింది. అవి..
– స్పిల్ వే పనుల్లో మొత్తం 18.75 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ అక్టోబరు వరకు 1.72 లక్షల క్యూబిక్ మీటర్లే చేశారు. మిగిలిన 17.03 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి అవసరమైన బ్యాచింగ్ ప్లాంట్ లేదు.
– కనీసం డిజైన్లను ఇప్పటివరకూ రూపొందించుకోలేదు.
– జలాశయంలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ 18,830 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకూ కేవలం 3,922 కుటుంబాలకు మాత్రమే కల్పించారు.
– ఎడమ కాలువలో 452 నిర్మాణాలకుగానూ ఇప్పటికీ 306 నిర్మాణాల పనులు ప్రారంభించలేదని.. కుడి కాలువలో 255 నిర్మాణాలకుగానూ 70 నిర్మాణాల పనులు ప్రారంభించలేదు. కనెక్టివిటీస్ పనులు కూడా కొలిక్కి రాలేదు.
– ఆయకట్టుకు నీళ్లందించే పిల్ల కాలువ (డిస్ట్రిబ్యూటరీ)ల కోసం ఇప్పటికీ సర్వే, భూసేకరణ పనులు చేయలేదు.
వీటిని బట్టి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోందని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది.
అడిగిన సమాచారం ఇవ్వరెందుకూ?
ఇదిలా ఉంటే.. నిపుణుల కమిటీ ఇప్పటికి మూడుసార్లు పోలవరంలో పర్యటించి నివేదిక ఇచ్చిందని.. కానీ అందులోని అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని అనేక సందర్భాల్లో కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచిందని.. దానిపై సీడబ్ల్యూసీ వ్యక్తంచేసిన సందేహాలను నివృత్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పేర్కొంది. దీనివల్లే పనులు గాడి తప్పుతున్నాయని.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోదంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని స్పష్టం చేసింది.
సకాలంలో పూర్తికి అవకాశంలేదు
ఇదిలా ఉంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే 2019, డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశంలేదని నిపుణుల కమిటీ తేల్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విధి విధానాలను ఖరారుచేసి, అధికారాలు కల్పిస్తే తప్ప పనులు దారిలోకి వచ్చే అవకాశంలేదని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు గత నెల 30న సీడబ్ల్యూసీ సభ్యులు వైకే శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా పనులను గాడిలో పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. వ్యాప్కోస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ.. సీఎస్‌ఎంఆర్‌ఎస్ ద్వారా నాణ్యతను నిర్ధారించుకుంటూ గడువులోగా పూర్తిచేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
‘పోలవరం’లో నాణ్యత డొల్లే
Published Thu, Nov 15 2018 4:28 AM | Last Updated on Thu, Nov 15 2018 4:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment