సాక్షి, అమరావతి: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి.. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికిచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకోనుంది. ఈ కమిటీ గురువారం, శుక్రవారాల్లో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తుంది. అనంతరం జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఆ తర్వాత శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకుంటుంది. ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులపై కేంద్రానికి నివేదికిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా పోలవరంపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో కమిటీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 7, 2016న దక్కించుకోవడం తెలిసిందే.
అప్పటినుంచి ప్రాజెక్టు పనుల్లో పురోగతి కన్పించకపోవడంతో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యుడు మసూద్ హుస్సేన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మార్చి 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు ప్రాజెక్టు పనులను పరిశీలించి.. మార్చి 21న కేంద్రానికి నివేదిక అందజేసింది. పనుల పురోగతిపై రాష్ట్రప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవ స్థితిగతులకు పొంతనే లేదని తన నివేదికలో కమిటీ తూర్పారబట్టింది. కనీసం డిజైన్‌లూ రూపొందించలేకపోవడాన్ని తప్పుబట్టింది. పనులు ఎక్కడివక్కడే ఉన్నప్పటికీ.. డిసెంబర్, 2018 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్రప్రభుత్వం చెబుతుండడంపై విస్మయం వెలిబుచ్చింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డిజైన్‌లపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. తర్వాత జూలై 11న కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించి.. గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచుతూ పంపిన ప్రతిపాదనల(డీపీఆర్–2)పై పలు సందేహాలను లేవనెత్తిన గడ్కరీ వాటిని నివృత్తి చేస్తేనే డీపీఆర్–2ను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పారు. దీంతో రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు ఇటీవల రెండు దఫాలుగా ఢిల్లీకి వెళ్లి సీడబ్ల్యూసీ అధికారులతో సమావేశమై.. వివరణలిచ్చారు. ఆ వివరణలపై సీడబ్ల్యూసీ సంతృప్తి చెందలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించాక, వాస్తవ స్థితిగతుల ఆధారంగానే డీపీఆర్–2పై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పోలవరం పనుల పరిశీలనకు నిపుణుల కమిటీని కేంద్రం పంపిందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని జలవనరులశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మసూద్ హుస్సేన్ సీడబ్ల్యూసీ చైర్మన్‌గా పదోన్నతి పొందిన నేపథ్యంలో కమిటీకి సీడబ్ల్యూసీ సభ్యుడు వైకే శర్మ నేతృత్వం వహించనున్నారు.
పోలవరంపై కేంద్రం దృష్టి
Published Wed, Sep 5 2018 3:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment