సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీరు–చెట్టు పథకం కింద రూ.1,216.84 కోట్ల బిల్లుల బకాయిలను చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేయని పనులను చేసినట్లు చూపడం.. గతంలో చేసిన పనులను తాజాగా చేసినట్లు చూపడం ద్వారా టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వేలాది కోట్ల రూపాయలను నీరు–చెట్టు పథకం కింద దోచుకున్నారు. 2015–16 నుంచి మే 29, 2019 దాకా ఈ పథకానికి రూ.18,060.70 కోట్లను టీడీపీ సర్కార్ ఖర్చు చేసింది. చేసిన పనులకంటూ రూ.16,843.86 కోట్ల బిల్లులను చెల్లించింది. ఇంకా రూ.1,216.84 కోట్లు బకాయిపడింది.
నీరు–చెట్టు పథకంలో అక్రమాల గుట్టు విప్పేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బకాయిపడ్డ బిల్లులను చెల్లించవద్దని ఈ నెల 6న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. వాటిని అమలు చేస్తూ బకాయి బిల్లులు చెల్లించకూడదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్న నీటివనరుల పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ పేరుతో 2015–16లో టీడీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని ప్రారంభించింది. ఉపాధి హామీ, జలవనరులు, అటవీ శాఖల ద్వారా నిధులను సమీకరించి.. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టల మరమ్మతులు, తూముల మార్పిడి, చెరువులకు నీటిని సరఫరా చేసే సప్లయ్ ఛానల్స్ (వాగులు, వంకలు)లో పూడిక తీత, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణ, కొత్త చెక్ డ్యామ్‌ల నిర్మాణం, కాంటూరు కందకాలు, పంట కుంటల తవ్వకం పనులను ‘నీరు–చెట్టు’ కింద చేపట్టారు.
టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో అప్పగించి..
నీరు–చెట్టు పథకం కింద రూ.పది లక్షల అంచనా వ్యయం లోపు ఉండే పనులను.. ‘జన్మభూమి కమిటీ’ల ముసుగులో టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో టీడీపీ సర్కార్ అప్పగించింది. గతంలో చేసిన పనులనే తాజాగా చేసినట్లు చూపడం.. ఉపాధి హామీ కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో తూతూమంత్రంగా చేయడం.. పనులు చేయకుండానే చేసినట్లు చూపడం ద్వారా వేలాది కోట్ల రూపాయలను కాజేశారు. నీరు–చెట్టు కింద మే 28, 2019 వరకూ రూ.16,843.86 కోట్ల బిల్లులు చెల్లించగా.. ఇందులో కనీసం రూ.15 వేల కోట్లకుపైగా టీడీపీ నేతలే దోచుకున్నారని అంచనా.
నిబంధనలను పట్టించుకోకుండా..
నిబంధనల ప్రకారం.. నీరు–చెట్టు పథకం కింద చెరువులు, వంకలు, వాగుల్లో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాలకు తరలించాలి. 2015–16 నుంచి మే, 29, 2019 వరకూ చెరువులు, వాగులు, వంకల్లో 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. కానీ.. ఏ ఒక్క రైతుకూ ఒక్క క్యూబిక్ మీటర్ మట్టిని ఉచితంగా సరఫరా చేసిన దాఖలాలు లేవు. అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు క్యూబిక్ మీటర్ మట్టిని సగటున రూ.500 చొప్పున విక్రయించుకోవడం ద్వారా రూ.45,955 కోట్లు దోచుకున్నారు. మట్టి నుంచి దోచుకున్న సొమ్ములో సింహభాగం అప్పటి సీఎం చంద్రబాబుకు కమీషన్‌ల రూపంలో టీడీపీ ఎమ్మెల్యేలు ముట్టజెప్పారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
తగ్గిన ఆయకట్టు.. పెరగని భూగర్భ జలాలు
నీరు–చెట్టు పథకం కింద చెరువులు, కుంటల్లో 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లుగానూ.. 96,439 చెక్ డ్యామ్‌లను నిర్మించినట్లుగానూ.. 8,46,673 పంట కుంటలు తవ్వినట్లుగానూ, 8,23,775 జలసంరక్షణ పనులు చేసినట్లుగా టీడీపీ సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో చెరువులు, కుంటల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నీరు–చెట్టు కింద చిన్న నీటి వనరులను పరిరక్షించి ఉంటే పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లంది ఉండాలి. కానీ.. 2018–19 నాటికి ఆయకట్టు 9.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. పథకంలో చేపట్టిన పనుల వల్ల కనీసం భూగర్భ జలాలు పెరిగాయా అంటే అదీ లేదు. 2014, మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 9.21 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం అది 13.46 మీటర్లకు తగ్గడం గమనార్హం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే నీరు–చెట్టు కింద భారీ ఎత్తున అవినీతి జరిగిట్లు స్పష్టమవుతోంది. నీరు–చెట్టు పథకం కింద టీడీపీ సర్కార్ వ్యయం చేసిన రూ.18,060.70 కోట్లను పోలవరం ప్రాజెక్టుపై వెచ్చించి ఉంటే.. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదని అధికార వర్గాలే చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment