మరో రూ.8 వేల కోట్లు గుటుక్కు! | Heavy robbery in the name of Neeru chettu programme | Sakshi
Sakshi News home page

‘చెట్టు’ చాటున గుటుక్కు ఖాతా.. మరో రూ.8 వేల కోట్లు!

Published Tue, Oct 16 2018 2:48 AM | Last Updated on Tue, Oct 16 2018 11:40 AM

Heavy robbery in the name of Neeru chettu programme - Sakshi

నీరు–చెట్టు కింద గతంలో చేసిన పనులనే తాజాగా చేసినట్లు చూపడం, చేయని పనులను చేసినట్టు చూపడం.. అవసరం లేకున్నా పూడికతీత పనులు చేపట్టడం,అరకొరగా చేసిన పనులను నాసిరకంగా ముగించడం ద్వారా నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లను అధికార పార్టీ నేతలు దోచుకున్నారు. పూడికతీసిన మట్టిని అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నీరు–చెట్టు పథకం కింద మరో రూ.8 వేల కోట్ల విలువైన పనులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నాలుగు నెలల్లోగా ఈ పనులను మంజూరు చేయడంతోపాటు పూర్తి చేయించి టీడీపీ శ్రేణులకు పంచి పెట్టాలనేది ప్రభుత్వ పెద్దల ప్రణాళిక అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, అమరావతి: ‘నీరు–చెట్టు’ మాటున అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు నిధుల పందేరం కొనసాగుతోంది. ఇప్పటికే రూ.15,368.47 కోట్లను దోచిపెట్టిన సర్కారు ఎన్నికలు సమీపిస్తుండటంతో మరో రూ.8,000 కోట్లను పంచి పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్ల నుంచి ఒత్తిడి తెచ్చి ఈమేరకు ప్రతిపాదనలు తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు వీటిని ఆమోదించాలంటూ ఆర్థిక, జలవనరుల శాఖల అధికారులపైన కూడా తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. నీరు–చెట్టుకు 2018–19 బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లు ఇప్పటికే ఖర్చు అయ్యాయని, ఎఫ్‌ఆర్‌బీఎం(ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం) ప్రకారం ఇక అదనంగా కేటాయించలేమంటూ ఆర్థికశాఖ వర్గాలు అభ్యంతరం చెప్పడంతో కేంద్రం ఇచ్చే ఉపాధిహామీ నిధులను మళ్లించడంతోపాటు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి అదనంగా విడుదల చేయాల్సిందేనంటూ ఒత్తిడి పెంచుతున్నారు.

కలెక్టర్లకు రూ.20 లక్షల లోపు పనుల అధికారం
రాష్ట్రంలో చెరువులు, కాలువల్లో పూడికతీత, షట్టర్‌ల మరమ్మతులు, పంటకుంటల తవ్వకం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం లాంటి జలసంరక్షణ పనుల కోసం ‘నీరు–చెట్టు’ పథకానికి 2018–19 బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించారు. గతేడాది టీడీపీ నేతలు కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఇష్టారాజ్యంగా పనులు మంజూరు చేయించుకుని నిధులు మింగేశారు. దాంతో ఈసారి జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లను 13 జిల్లాలకు పంపిణీ చేశారు. అంచనా వ్యయం రూ.20 లక్షలలోపు ఉండే పనుల మంజూరు అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. అంతకంటే అధికంగా ఖర్చయ్యే పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ అనుమతి తప్పనిసరని పేర్కొంటూ అందుకోసం ఆ రూ. 500 కోట్లలో రూ.100 కోట్లను కేటాయించింది.

రూ.వేల కోట్ల పనుల ఆమోదం కోసం ప్రతిపాదనలు..
అయితే ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో నీరు–చెట్టు కింద పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలువురు కలెక్టర్లు జలవనరులశాఖకు వందల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు పంపారు. ఉదాహరణకు విజయనగరం జిల్లా నే తీసుకుంటే చీపురుపల్లి మండలం పరిధిలోని కందివలస గెడ్డలో పూడికతీత పనులకు రూ.1.94 కోట్లు, కాకర్లవానిగెడ్డలో పూడికతీకు రూ.1.96 కోట్లు, గరివిడి మండలం వీపీ రేగ బామల్వాని గెడ్డలో పూడికతీత పనులకు రూ.1.96 కోట్లు, కందివలసగడ్డలో పూడికతీతకు రూ. 1.95 కోట్లు, కెళ్ల గెడ్డలో పూడికతీతకు రూ. 1.97 కోట్లు, మెరకముడిదం మండలం కొండగెడ్డలో పూడికతీతకు రూ.1.98 కోట్లు, కొండగడ్డలో లింక్‌ చానళ్ల పూడికతీతకు రూ.1.95 కోట్లు.. ఇలా వెరసి ఏడు పనులకే రూ.13.71 కోట్లు మంజూరు చేయాలంటూ కలెక్టర్‌ నుంచి ప్రతిపాదనలు అందాయి. అవిచూసి జలవనరుల శాఖ అధికారవర్గాలు విస్తుపోతున్నాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా వేల కోట్ల రూపాయల విలువైన పనులను నీరు–చెట్టు కింద మంజూరు చేయాలంటూ ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలన్నీ కలిపి చూపుతూ మరో రూ. 8000 కోట్ల పంపిణీకి సర్కారు పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement