
సాక్షి,అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. జల వనరుల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ఆరా తీశారాయన.
పోలవరం – ముందస్తు వరదలు.
► పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తు వరదలపై సమగ్ర సమీక్ష.
► పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్–1, గ్యాప్–2లు పూడ్చే పనుల అంశంపై విస్తృత చర్చ.
► రెండు గ్యాప్‌లను పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమన్న అధికారులు.
► ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన టెస్టులు పూర్తికావాల్సి ఉందని సీఎం జగన్‌కు తెలిపిన అధికారులు.
► చేయాల్సిన టెస్టులు, నివేదికలు పూర్తికాకముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాపర్ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరిందని వివరణ.
► వరదలు తగ్గాక ఈ పరీక్షలు పూర్తిచేస్తామని సీఎం జగన్‌కు వివరించిన అధికారులు.
► మరోవైపు షెడ్యూలు ప్రకారం జరుగుతున్న దిగువ కాపర్‌డ్యాం పనులకు కూడా.. ముందస్తు వరదల కారణంగా అంతరాయం.
► గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాపర్ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఏర్పడదన్న అధికారులు.
► వరదలు పూర్తిగా తగ్గితే... ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారుల అంచనా.
► ఈ పరిస్థితి రాగానే.. ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికార యంత్రాగానికి సీఎం జగన్ సూచన.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందని సీఎం జగన్, అధికారులతో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెకులో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్‌గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. కాంపొనెంట్ వైజ్‌గా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా.. అడహాక్‌గా డబ్బులు తెప్పించుకుంటే..., ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను త్వరితగతిన ముందుకు కొనసాగించవచ్చని అధికారులకు ఆయన సూచించారు. వరద తగ్గగానే ఈ పనులు శరవేగంతో చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారాయన. ఈమేరకు అడహాక్‌గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టిపెట్టాలని, కేంద్రానికి లేఖలు కూడా రాయాలని సీఎం జగన్ తెలిపారు. పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచన.
ఆగష్టులో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం
► ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.
► బ్యారేజీపై పెట్టాల్సిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురుచూస్తున్నామని, అది కూడా త్వరలో చేరుకుంటుందని వెల్లడించారు.
► అలాగే.. దసరా నాటికి టన్నెల్–2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు.
వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ – 2పనులపైనా సీఎం సమీక్ష
► ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల పనులు చేశామన్న అధికారులు.
► నెలవారీగా కార్యాచరణ సిద్ధంచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని సీఎం జగన్ స్పష్టీకరణ.
► వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామన్న అధికారులు.
► అదే సమయంలో గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలంకు నీరందించే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్రతనయ, తారకరామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, రాయలసీమలోని జొలదరాశి,రాజోలిబండ, కుందూ లిఫ్ట్, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు, వీటితోపాటు చింతలపూడి, వైయస్సార్ పల్నాడు, మడకశిర బైపాస్ కెనాల్, బైరవానితిప్ప, వరికెశెలపూడి కలుపుకుని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి లక్ష్యాలను సీఎం జగన్ నిర్దేశించారు.
కర్నూలు పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి: సీఎం జగన్
దశాబ్దాల తరబడి పశ్చిమ కర్నూలు ప్రాంతం బాగా వెనకబడి ఉంది. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. నీటి వసతుల పరంగా, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతం ఇదే. దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కొనసాగుతున్న వలసలను నివారించడానికి కార్యాచరణ సిద్ధంచేయాలి. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలి. దీనివల్ల ప్రజలకు వ్యాపకం దొరుకుతుంది, వలసలను నివారించగలుగుతాం. ఐటీఐ, పాలిటెట్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలు తదితర విద్యాసంస్థల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధంచేయాలి. ఈ ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
జల వనరులపై చేపట్టిన సమీక్షా సమావేశంలో జలవనరులశాఖమంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment