సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 9 శాతం లోటు వర్షపాతంతో మట్టాలు తగ్గిపోగా ప్రస్తుతం యాసంగి పంటల సాగు పెరగడంతో పాటుగా వేసవి ఉధృతి తోడు కావడంతో భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో నీటి వినియోగం పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.94 మీటర్ల మేర భూగర్భ మట్టం కిందకి దిగజారింది. పూర్తి స్థాయిలో పంటలకు నీటి వినియోగం పెరిగితే అది మరింత తీవ్రంగా ఉంటుందని భూగర్భ జల విభాగం హెచ్చరించింది. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు 23 లక్షల బోర్ల ద్వారా భూగర్భ నీటిని వినియోగిస్తున్నారు.
డిసెంబర్ నాటికే పడిపోయిన మట్టాలు
ఈ ఏడాది మెదక్, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో 35 నుంచి 21 శాతం వరకు తక్కువ వర్షపాతం కురిసింది. దీంతో చాలా జిల్లాల్లో డిసెంబర్ నాటికే 0.5 మీటర్ల నుంచి 5.07 మీటర్ల వరకు నీటి మట్టాలు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భమట్టం 10.17 మీటర్లు ఉండగా, ఈ ఏడాది సగటు మట్టం 10.97 మీటర్లుగా ఉంది. అంటే గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది 0.80 మీటర్ల మేర మట్టాలు పడిపోయాయి.
ఇక గత ఏడాది డిసెంబర్‌లో సగటు మట్టాలు 9.18 మీటర్లు ఉండగా, ప్రస్తుతం ఉన్న మట్టం 10.17తో పోలిస్తే ఏకంగా 0.99 మీటర్లు మేర మట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జల వనరుల శాఖ తాజా నివేదిక ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి మట్టాలతో పోలిస్తే అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 4.09 మీటర్లు దిగువకు పడిపోగా, తర్వాతి స్థానాల్లో పెద్దపల్లి 3.85, నిజామాబాద్ 3.61, మెదక్ 3.61, నిర్మల్ 3.40 మీటర్లు మేర మట్టాలు పడిపోయాయి.
పడిపోతున్న భూగర్భ జలాలు
Published Sun, Mar 11 2018 3:02 AM | Last Updated on Sun, Mar 11 2018 3:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment