అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు | ENC Narayana Reddy On Uttarandhra Projects | Sakshi
Sakshi News home page

అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు

Published Wed, Oct 12 2022 3:26 AM | Last Updated on Wed, Oct 12 2022 3:26 AM

ENC Narayana Reddy On Uttarandhra Projects - Sakshi

సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగు నీటి రంగం అభివృద్ధిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతాంశంగా చేపట్టిందని, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్‌ – ఇన్‌ చీఫ్‌ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఆయన ఖండించారు.

గత ప్రభుత్వ తప్పిదాలను దాచిపెట్టి ప్రస్తుత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం ‘ఈనాడు’ చేస్తోందని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు.

ఈ ప్రాజెక్టుల నిధులను గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికా రహితంగా ఖర్చు చేసి, కాంట్రాక్టుల రూపంలో అనుయాయులకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు. వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, పనులు మాత్రం జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందన్నారు. 

వంశధార నిర్వాసితులకు అదనపు ప్రయోజనం
వంశధార ప్రాజెక్టు రెండో భాగం రెండో దశలో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని నారాయణ రెడ్డి తెలిపారు. దీని ద్వారా 27,800 ఎకరాలకు ఇప్పటికే నీటి వసతి లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాల్లోని 9 మండలాల్లో 225 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి  కలుగుతోందని తెలిపారు. అదేవిధంగా 1.2 టీఎంసీల నీటిని హీరమండలం రిజర్వాయర్‌ ద్వారా కిడ్నీ వ్యాధి పీడిత ఉద్దానం ప్రాంతానికి సరఫరా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో వంశధార నిర్వాసితుల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు. ఈ నిర్వాసితులకు అదనపు ప్రయోజనం కల్పించేందుకు సీఎం జగన్‌ రూ. 217 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా హీర మండలం రిజర్వాయర్‌కు 12 టీఎంసీల నీటిని అందించేందుకు రూ. 176 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 

అనుసంధానంతో 18,527 ఎకరాల స్థిరీకరణ 
వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా 18,527 ఎకరాల స్థిరీకరణకు, 4 మండలాల్లోని 38 గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం రూ.145 కోట్ల నిధులకు అనుమతిచ్చిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగతా పనులు 2023 జూన్‌ నాటికి పూర్తవుతాయని తెలిపారు.

తోటపల్లి కుడి ప్రధాన కాలువను పొడిగించి విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గజపతినగరం బ్రాంచి కాలువ పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో 43% పనులు పూర్తయ్యాయని, భూ సేకరణలో కొన్ని ఇబ్బందుల వల్ల మిగిలిన పనులు ఆగాయని చెప్పారు. మిగతా పనులకు రూ.137 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు. ఈ పనులను కూడా 2024 జూన్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. 

తారకరామతీర్థ సాగరం ద్వారా 16 వేల ఎకరాలకు నీరు 
విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చంపావతి నదికి అడ్డంగా తారకరామతీర్థ సాగరం బ్యారేజి నిర్మించి 2.75 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని, మూడు మండలాల్లోని 49 గ్రామాల్లో 16,538 ఎకరాలకు నీరు ఇవ్వచ్చని చెప్పారు. ఈ పనులు 59 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులకు రూ.198 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి పనులు అప్పగిస్తామన్నారు. పునరావాస కార్యక్రమాలను ముందుగానే పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 

తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు 
ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.7,214 కోట్లతో బీఆర్‌ అంబేడ్కర్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని నారాయణ రెడ్డి గుర్తు చేశారు. దీనిద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖతోపాటు ఇతర ప్రాంతాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు తరలించాలనేది లక్ష్యమన్నారు.

తొలి దశలో రెండు ప్యాకేజీల్లో గత ప్రభుత్వం 2017–18లో  రూ.2,022కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినా పురోగతి లేదన్నారు. 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, అంచనాలను రూ.17,411కోట్లకు పెంచిందన్నారు. ఫేజ్‌–2 కింద రెండు ప్యాకేజీలను చేపట్టిందన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 63వ కిలోమీటరు నుంచి 102వ కిలోమీటరు పొడవున శ్రీకా కుళం జిల్లా నడిగెడ్డ వరకు నీటిని తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 7,500 ఎకరాల భూసేకరణ త్వరగా జరుగుతోందని, 60 శాతం మేర డిజైన్లకు అనుమతి లభించిందన్నారు.

మడ్డువలస రెండో దశ పనులు 79% పూర్తి
మడ్డువలస రిజర్వాయర్‌ నుంచి కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు 1.5టీఎంసీల నీరిచ్చే లక్ష్యంతో  రెండో దశ పనులను చేపట్టామని ఈఎన్‌సీ చెప్పారు. దీనివల్ల జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికే 79 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను పాత కాంట్రాక్టరు చేయలేకపోవడంతో రూ.26.9కోట్లతో సవరిం చిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించిందన్నా రు. వచ్చే ఖరీఫ్‌కు ఈ పనులు పూర్తవుతాయన్నారు.

తోటపల్లి బ్యారేజి 83% పూర్తి 
విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మించి 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 1,31,000 ఎకరాల ఆయకట్టుకు 15.89 టీఎంసీల నీరిచ్చేందుకు తోటపల్లి బ్యారేజ్‌ పనులను ప్రభుత్వం చేపట్టిందని నారాయణరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.1127.58 కోట్లతో చేపట్టగా, 83 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రూ.123.21 కోట్లతో మిగిలిన పనులను రెండు ప్యాకేజిలుగా చేపట్టామన్నారు. ఈ పనులు 2023 జూన్‌కి పూర్తవుతాయన్నారు.

రూ.854 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌
మహేంద్రతనయ నది మీద చాప్రా గ్రామం వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మించి 1,200 క్యూసెక్కుల నీటిని రేగులపాడు రిజర్వాయర్‌కు తరలించే ప్రధాన ఉద్దేశంతో ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నట్టు నారాయణరెడ్డి తెలిపారు. 2.1 టీఎంసీల నీటిని నిల్వచేసే ఈ రిజర్వాయర్‌ ద్వారా 24,600 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియల్లో ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు.

అయితే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, రూ.854.25 కోట్లతో మిగిలిన పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చిందని చెప్పారు. త్వరలోనే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులను చేపట్టి 2024 ఖరీఫ్‌ నాటికి ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement