సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వరదాయని పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ నేతల అక్రమాల పర్వాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయడం పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడింది. ఒప్పందం చేసుకున్నాక మూడేళ్ల వరకూ పనులే ప్రారంభించని హెడ్ వర్క్స్(జలాశయం) కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. రూ.1,389.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారంటూ సర్కార్ తీరును తూర్పరబట్టింది. హెడ్ వర్క్స్ పనుల్లో పురోగతి లేకున్నా జూన్, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదని తేల్చిపారేసింది.
ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 16,010.45 కోట్ల నుంచి రూ. 55,132.92 కోట్లకు (ఆ తర్వాత రూ.57,940.86 కోట్లకు పెంచారు) సవరిస్తూ రూపొందించిన ప్రతిపాదనంతా తప్పులతడక అని అభివర్ణించింది. 2017–18లో జాతీయ సాగునీటి ప్రాజెక్టు పనులపై రూపొందించిన కాగ్ నివేదికను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టు పనుల తీరును నిశితంగా పరిశీలించిన కాగ్.. పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అవతవకలకు పాల్పడినట్లు తేల్చింది. దేశంలో 16 జాతీయ సాగునీటి ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్లోనే పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్(ఏపీడీఎస్‌ఎస్) ప్రకారం పనులు చేయని కాంట్రాక్టర్లపై అపరాధ రుసుం విధించాల్సిందిపోయి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. వాటిని అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తుండటాన్ని కాగ్ తప్పుబట్టింది.
ఇంతలోనే అంత తేడానా?
వచ్చే సంవత్సరం జూన్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తికావడం అసాధ్యమని కాగ్ స్పష్టం చేసింది. హెడ్ వర్క్స్‌లో హెడ్ రెగ్యులేటర్ పనులు 93 శాతం, కనెక్టివ్స్ పనులు 46 శాతం, ప్రధాన డ్యామ్ పనులు 41.19 శాతం, ఇతర పనులు 94 శాతం మిగిలిపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జలాశయంలో పూర్తి స్థాయి అంటే 45.72 మీటర్ల కాంటూర్‌లో కాకుండా కనీస స్థాయిలో అంటే 41.12 మీటర్ల కాంటూర్‌లో నీటిని నిల్వ చేయాలంటే 11,552 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. కానీ.. తాము పరిశీలించే నాటికి ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించకపోవడాన్ని కాగ్ ప్రస్తావించింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ తయారు చేసిన ప్రతిపాదనల (డీపీఆర్–2)ను తప్పులతడకగా కాగ్ పేర్కొంది.
ప్రాజెక్టు అంచనా వ్యయం 2009 నాటికి రూ.10,151.04 కోట్లు ఉంటే.. దాన్ని 2011 నాటికి రూ.16,010.45 కోట్లకు పెంచారని, 2013–14 ధరల ప్రకారం 2017లో అంచనా వ్యయాన్ని మళ్లీ సవరించి రూ. 55,132.92 కోట్లకు పెంచేస్తూ రూపొందించిన ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించని విషయాన్ని గుర్తుచేసింది. 2009, 2011 నాటికి పోలవరం జలాశయంలో 276 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అప్పటి డీపీఆర్‌లో పేర్కొందని, 2017లో రూపొందించిన డీపీఆర్–2 ప్రకారం ముంపు గ్రామాలు 371కి పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంపునకు గురయ్యే కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,05,601కు పెరగడంపైనా సందేహాలు వెలిబుచ్చింది. సర్వేలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల కుడి, ఎడమ కాలువల అలైన్‌మెంట్లు మారిపోయాయని, దీని వల్ల అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చి ఖజానాపై భారీగా భారం పడిందని కాగ్ నివేదికలో పేర్కొంది.
హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్‌కు భారీ ప్రయోజనం
మార్చి, 2013లో పోలవరం హెడ్ వర్క్స్‌ను రూ. 4,054 కోట్లకు కాంట్రాక్టర్ (ప్రస్తుత టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ జాయింట్ వెంచర్)కు సర్కార్ అప్పగించింది. ఆగస్టు, 2015 వరకూ కాంట్రాక్టర్ ఎలాంటి పనులు చేయలేదు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌పై ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ (ఏపీడీఎస్‌ఎస్) నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఎదురు ప్రయోజనం చేకూర్చిందని తెలిపింది.
హెడ్ వర్క్స్ పనుల్లో ధరలు పెరిగాయనే సాకు చూపి అంననా వ్యయాన్ని రూ. 5,385.91 కోట్లు పెంచేశారని.. దీని వల్ల కాంట్రాక్టర్‌కు రూ. 1,331.91 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారంటూ ప్రభుత్వ పెద్దల అక్రమాలను ఎత్తిచూపింది. ఒప్పందం ప్రకారం హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్ సమకూర్చుకోవాల్సిన స్టీల్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చి దాని కోసం ఖర్చు చేసిన రూ. 25.37 కోట్లను ఆ కాంట్రాక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయలేదంటూ కాగ్ వెల్లడించింది. అలాగే తవ్విన మట్టిన పోసేందుకు అవసరమైన భూమి (డంపింగ్ యార్డ్) కాంట్రాక్టరే సేకరించుకోవాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వమే దానిని రూ. 32.66 కోట్లతో సేకరించి ఇచ్చి ఆ నిధులను ఇప్పటి వరకూ వసూలు చేయకపోవడాన్ని కాగ్ ఎత్తిచూపింది.
అడ్డగోలుగా నామినేషన్ దందా
పోలవరం ఎడమ కాలువలో మూడు ప్యాకేజీల పనుల్లోనే రూ. 256.7 కోట్లు భారం ఖజానాపై పడిందని కాగ్ తేల్చింది. ఆ మేరకు అస్మదీయ కాంట్రాక్టర్‌లకు లబ్ధి చేకూర్చినట్లు పేర్కొంది.
– ఒకటో ప్యాకేజీ (0 కి.మీ. నుంచి 25.60 కి.మీ.వరకూ ) పనులను రూ. 254.88 కోట్లకు మార్చి, 2005లో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో పనులు పూర్తి కావాలి. కానీ జూన్, 2017 వరకూ ఆ పనులు పూర్తి కాలేదు. ఏపీడీఎస్‌ఎస్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. ఒప్పంద విలువలో ఐదు శాతం అంటే రూ. 12.74 కోట్లు అపరాధ రుసుం కింద వసూలు చేయాలి. ఐతే కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మిగిలిపోయిన రూ. 38.78 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించి, ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.171.39 కోట్లకు పెంచేసి, నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కొత్త కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. అంచనా వ్యయం పెంచడం వల్ల రూ. 132.61 కోట్లు, పాత కాంట్రాక్టర్ నుంచి అపరాధ రుసుం కింద రూ.12.74 కోట్లను వసూలు చేయకపోవడం వల్ల ఖజానాపై రూ.145.35 కోట్ల భారం పడిందని కాగ్ పేర్కొంది.
– నాలుగో ప్యాకేజీ (69.145 కి.మీ. నుంచి 93.70 కి.మీ. వరకూ) పనులను మార్చి, 2005లో రూ. 206.80 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఒప్పందం ప్రకారం 24 నెలల్లోగా పనులు పూర్తి కావాలి. కానీ.. జూన్, 2017 వరకూ పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ నుంచి రూ.10.34 కోట్లు అపరాధ రుసుంగా వసూలు చేయాలి. మిగిలిపోయిన రూ. 66.07 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించి.. వాటి అంచనా వ్యయాన్ని రూ. 108.86 కోట్లకు పెంచేసి.. నామినేషన్ పద్ధతిపై కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అంచనా వ్యయాన్ని పెంచడం వల్ల రూ. 42.79 కోట్లు, అపరాధ రుసం రూ.10.34 కోట్లు వసూలు చేయకపోవడం వల్ల సర్కార్ ఖజానాకు రూ.53.13 కోట్లు నష్టం వాటిల్లిందని కాగ్ ఎత్తిచూపింది.
– ఐదో ప్యాకేజీ(93.70 కి.మీ. నుంచి 111 కి.మీ. వరకూ) పనులను మార్చి, 2005లో రూ.181.60 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 24 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలి. కానీ.. జూన్, 2017 వరకూ పనులు పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ నుంచి రూ. 9.08 కోట్లు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిగిలిన రూ.93.74 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ. 142.88 కోట్లకు పెంచేసి కొత్త కాంట్రాక్టర్‌కు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అంచనా వ్యయం పెంచడం వల్ల రూ. 49.14 కోట్లు, అపరాధ రుసుం వసూలు చేయకపోవడం వల్ల రూ.9.08 కోట్లు వెరసి రూ.58.22 కోట్ల మేర ఖజానాపై భారం పడిందని కాగ్ వెల్లడించింది.
కుడి కాలువలోనూ అదేతీరు..
పోలవరం కుడి కాలువ రెండో ప్యాకేజీ పనుల్లో 19 కి.మీ. వద్ద, 19.75 కి.మీ. వద్ద హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జీఏఐఎల్) పైపు లైన్‌లు క్రాస్ అవుతాయి. ఈ క్రాసింగ్‌ల్లో పైపు లైన్‌లు మార్చే పనుల వ్యయాన్ని కాంట్రాక్టరే భరించాలి. ఈ మేరకు మే, 2012లో రూ. 2.72 కోట్లు డిపాజిట్ చేయాలని హెచ్‌పీసీఎల్, రూ. 4.47 కోట్లు డిపాజిట్ చేయాలని జీఏఐఎల్ కాంట్రాక్టర్‌ను కోరాయి. కానీ.. మే, 2015 వరకూ కాంట్రాక్టర్ ఆ డబ్బు డిపాజిట్ చేయలేదు. పనులు వేగవంతంగా జరగాలనే సాకు చూపి రాష్ట్ర ప్రభుత్వమే జీఏఐఎల్‌కు రూ. 6.89 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.7.21 కోట్లు డిపాజిట్ చేసింది. వాటిని ఇప్పటివరకూ కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment