సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తూర్పారబడుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ఇచ్చిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. బుధవారం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించే సమయంలో నిర్వహించే సమీక్ష సమావేశంలో గడ్కరీ.. కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తప్పులను ఎత్తిచూపితే వాటిని ఎలా సమర్థించుకోవాలనే అంశంపై రెండు రోజులుగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. అధికారులతో ఎడతెగని సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చాక బుధవారం ఉదయం 10 గంటలకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. పీపీఏ ఇచ్చిన నివేదికను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి గడ్కరీ పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పనుల వాస్తవ స్థితిగతులపై మసూద్ హుస్సేన్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదికను ప్రాతిపదికగా చేసుకుని వ్యాప్కోస్ సారథ్యంలో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. పునర్విభజన చట్టంలో సెక్షన్–90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో తామే నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు మే 28, 2014న ఏర్పాటైన పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చింది. తుదకు సెప్టెంబరు 7, 2016న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే దక్కించుకోవడం.. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీకి సోమవారం పీపీఏ సీఈవో, సభ్య కార్యదర్శి హెచ్‌కే హల్దర్, డాక్టర్ ఆర్కే గుప్తాలు ఇచ్చిన నివేదికలో అంశాల వారీగా రాష్ట్ర ప్రభుత్వ తీరును పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది. అధికార వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఆ నివేదికలో పీపీఏ లేవనెత్తిన అంశాలు ఇవీ..
– 2104 మే 28న కేంద్రం జారీ చేసిన పీపీఏ గెజిట్ నోటిఫికేషన్‌లో సెక్షన్–9(1) ప్రకారం ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్‌ను తొలగించాలన్నా, కొత్తగా టెండర్లు పిలవాలన్నా, పనులు రద్దు చేయాలన్నా, కొత్తగా పనులు చేర్చాలన్నా రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ అనుమతి తప్పనిసరి. ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ 2015 సెప్టెంబరు 8న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. అయితే దీనిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.
– పోలవరం ఎడమ కాలువలో ఆరో ప్యాకేజీ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ నాలుగేళ్లుగా పనులే చేయడం లేదు. ఆ సంస్థపై ఏపీడీఎస్‌ఎస్(ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 60–సీ నిబంధన మేరకు వేటు వేయడం లేదు. కారణం ఏమిటని వాకబు చేస్తే ఆ సంస్థ టీడీపీ మాజీ ఎంపీదని తేలింది. కానీ.. ఐదో ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై వేటు వేశారు. అందులో మిగిలిన పనులను ఒక సంస్థకు నామినేషన్‌పై 2016 నవంబర్ 30న అప్పగించారు. ఒకటి, మూడు, నాలుగు, ఏడు, ఎనిమిది ప్యాకేజీల పనులనూ నామినేషన్‌పై కొత్త కాంట్రాక్టర్లకు 2017 జూన్ 1న కట్టబెట్టారు. వీటికి అనుమతి తీసుకోలేదని లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదు.
– పీపీఏ అనుమతి తీసుకోకుండానే.. హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్‌లో రూ.1395 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తప్పించి 2017 నవంబర్ 27న కొత్తగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ టెండర్లను నిలుపుదల చేయాలంటూ అదే ఏడాది నవంబర్ 29న అప్పటి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ టెండర్ల వివాదంపై అదే ఏడాది డిసెంబర్ 5న మీ సమక్షంలో జరిగిన సమావేశంలో, 2018 జనవరి 11న జరిగిన పీపీఏ సమావేశంలోనూ ఇదే అంశాన్ని ఎత్తిచూపాం. ఇకపై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
– కేంద్రం, పీపీఏకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తుంగలో తొక్కింది. పీపీఏ ఆమోదం తీసుకున్న తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్‌లో రూ.1243.67 కోట్ల విలువైన పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అందులో మిగిలిపోయిన రూ.921.87 కోట్ల విలువైన పనులను తాజాగా అదే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్‌ఎఫ్), కాఫర్ డ్యామ్ పనులనూ మరో కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు తెలిసింది. కానీ.. వీటికి తమ నుంచి అనుమతి తీసుకోలేదు.
– రాష్ట్ర ప్రభుత్వం 2013 జూలై 1న జారీ చేసిన జీవో 94 ప్రకారం ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానం ప్రకారం టెండర్ల ద్వారా అప్పగించిన పనులను.. కాంట్రాక్టర్‌తో ఒప్పందం రద్దు చేసుకోకుండా, వాటిలో కొంత భాగం పనులను ఎల్‌ఎస్(లంప్సమ్)– ఓపన్ విధానంలో అప్పగించకూడదు. కానీ.. పోలవరం హెడ్ వర్క్స్ పనులను నామినేషన్‌పై అప్పగించారు.
– కుడి, ఎడమ కాలువ పనుల్లో పురోగతి కనిపిస్తున్నా జలాశయం పనుల్లో ఆ మేరకు ప్రగతి కనిపించడం లేదు. డిజైన్‌ల ఆమోదంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి డిజైన్ తయారీలో సహకరించేందుకు కేంద్రం డీడీఆర్‌పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్)ను ఏర్పాటు చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించకపోవడం వల్ల డిజైన్‌ల ఆమోదంలో జాప్యం చోటు చేసుకుంటోంది.
– కాఫర్ డ్యామ్ ద్వారా 2019 నాటికే గ్రావిటీపై నీళ్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ.. ఆ మేరకు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment