
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తమ రాష్ట్రాలకు కలుగుతున్న ముంపుపై కలసి పోరాడుదామని ఒడిశా ప్రభుత్వం తెలంగాణకు ప్రతిపాదించింది. ముంపుపై పోరాడుతున్న తమతో కలిసిరావాలని విజ్ఞప్తి చేసింది.
కేంద్రాన్ని కదిలిస్తేనే పోలవరం ముంపుపై రీ సర్వేకు అవకాశముందని, అది జరిగితే 2 రాష్ట్రాలకు ఉభయకుశలోపరిగా ఉంటుందని తెలిపింది. మంగళవారం ఒడిశా జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే జెనా, చీఫ్ ఇంజనీర్(ప్లానింగ్) జీపీ రాయ్‌లు హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో జలసౌధలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఈఎన్‌సీ మురళీధర్, అంతర్రాష్ట్ర అధికారులు హాజరయ్యారు.