
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు పనుల్లో క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై మసూద్ హుస్సేన్ కమిటీ సోమవారం అధ్యయనం చేయనుంది. మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించి.. బుధవారం కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
ఆ నివేదిక ఆధారంగా 25న సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రాజెక్టు పనులపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, సీఈలు, ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లను కేంద్రం ఆదేశించింది.