
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్‌ఆర్) నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) వరకూ.. బీసీఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), గాలేరు–నగరి కాలువ 56.775 కి.మీ అభివృద్ధి పనుల టెండర్ ప్రతిపాదనకు జలవనరుల శాఖ జ్యుడిషియల్ ప్రివ్యూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకూ ఎస్సార్బీసీ.. గాలేరు–నగరి కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచేలా వాటికి లైనింగ్ చేయడం, అవుకు వద్ద మూడో సొరంగం తవ్వే పనులకు సంబంధించిన టెండర్ ప్రతిపాదనకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం తెలిపింది. దాంతో.. ఈ రెండు పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేయడానికి జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది.
► పీహెచ్‌ఆర్ నుంచి బీసీఆర్ వరకూ.. బీసీఆర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ వరకూ ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ అభివృద్ధి పనుల అంచనా వ్యయాన్ని రూ.1,061.69 కోట్లుగా నిర్ణయించింది.
► గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకూ కాలువలకు లైనింగ్, అవుకు వద్ద మూడో సొరంగం తవ్వే పనుల అంచనా వ్యయాన్ని రూ.1,269.49 కోట్లుగా నిర్ణయించింది.
► ఈ రెండు పనుల పూర్తికి 36 నెలల గడువు పెట్టింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతోనే టెండర్ నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ఓపెన్ విధానంలో టెండర్ నిర్వహించనుంది.
► ప్రైస్‌బిడ్ తెరిచిన తర్వాత.. ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనుంది.