
టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో గంజి లకుష్మంనాయుడు.(ఫైల్ ఫొటో) గంజి లక్షు్మంనాయుడు
అవినీతి పరులకు వారు అండగా నిలుస్తున్నారు. శాఖాపరమైన చర్యలకుఅడ్డుపడుతున్నారు. శిక్ష అమలుకు విఘాతం కల్పిస్తున్నారు. ఒక విధంగాచెప్పాలంటే అక్రమార్కులను పెంచి పోషిస్తున్నారు. అందుకే... ఆదాయానికిమించి ఆస్తులు కూడబెట్టినట్టు ఓ ఉద్యోగిపై ఏసీబీ అధికారులు తేల్చినా... న్యాయస్థానం శిక్షకు ఆదేశాలు జారీ చేసినా... క్రమశిక్షణా చర్యలకు శాఖాపరమైనఉత్తర్వులు వచ్చినా... అవేవీ ఆయన్ను ఏమీ చేయలేకపోయాయి. పాలకపక్ష నేతలఅండ ఉంటే ఇక ఎంతటి అవినీతికైనా పాల్పడవచ్చన్న సంకేతాలను పంపిస్తున్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: జలవనరుల శాఖ పార్వతీపురం కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గంజి లకుష్మంనాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసు రుజువు కావడంతో ఆయన్ను విధులనుంచి తొలగించాలంటూ మూడు రోజుల క్రితమే రాష్ట్ర జనవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ విజయవాడలోని ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన జీఓను కూడా సంబంధిత శాఖ జిల్లా కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తుంటాయి. లేదా ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది ఆ ఆదేశాల్లో స్పష్టంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు లకుష్మంనాయుడును విధుల నుంచి తొలగించలేదు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నిటిలో ‘రికార్డ్’ బ్రేక్
జలవనరుల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న లకుష్మంనాయుడు జిల్లా పరిధిలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరినీ శాసించగల సత్తావున్న ఘనుడు. ఆయన స్వస్థలం మక్కువ మండలం శంబర గ్రామం. అప్ప ట్లో.. అంటే వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నిర్మించిన సమయంలో నిర్వాసితుల్లో ఒకరైన లకు‡్ష్మంనాయుడు జలవనరుల శాఖలో రికార్డు సహాయకుడిగా విధుల్లో చేరారు. అనతి కాలంలోనే ఆ శాఖలో పట్టుసాధించారు. జలవనరుల శాఖకు సంబంధించి ఏ పని జరగా లన్నా ఆయన సలహా తీసుకోవాలన్న స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో అనేక ఆస్తులు కూడగట్టారు. 2008లో ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసి విశాఖపట్నం కోర్టులో ఛార్జిషీటును కూడా దాఖలు చేసింది. అయితేనేం వారం తిరగకుండానే తిరిగి ఉద్యోగ విధుల్లో చేరారాయన. అక్కడితో ఆగకుండా అనతికాలంలోనే సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. గతేడాది డిసెంబర్ 20న విశాఖపట్నం ఏసీబీ కోర్టు లకు‡్ష్మంనాయుడుకు మూడే ళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ హైకోర్టుకు అప్పీల్ చేసుకుని ఆయన మళ్లీ వెనువెంటనే విధుల్లో చేరడం అందరినీ ఆశ్చర్యపరచింది.
ఎన్నో ఏళ్లుగా ఇక్కడే తిష్ట
జలవనరుల శాఖలో ఏఈ, జేఈ, డీఈ, ఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు ఎందరో వస్తూ బదిలీపై వెళ్తున్నారు. కానీ లకుష్మంనాయుడు మాత్రం అక్కడే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. అంటే ఆయన పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ శాఖలోనైనా ఉద్యోగులు రెండుమూడేళ్ల తరువాత వేరొకచోటకు బదిలీపై వెళ్తుంటారు. ఐదేళ్లు పూర్తిచేసుకున్న తరువాత నిర్బంధ బదిలీపై తప్పనిసరిగా వేరొకచోటకు పంపిస్తుంటారు. కానీ ఈయన విషయంలో అవేవీ అమలు కాలేదు. రికార్డు సహాయకుడిగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా అక్కడే పనిచేయడం ఆయనకే చెల్లింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్య నేతలతో, ఎమ్మెల్యేలతో సత్ససంబంధాలు కలిగివుండడం ఆయన చాకచక్యానికి నిదర్శనం. అదే ఆయనను కాపాడుతోందంటుంటారు.
అధికారపార్టీ అండ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోవడం పరిపాటి. కానీ ఇక్కడ అలాంటివేవీ జరగలేదు. ఇన్నాళ్లకు లకుష్మంనాయుడును తొలగించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం దానిపై ఏ మాత్రం స్పందించడం లేదు. ఎస్‌ఈ, డీఈ స్థాయి అధికారులను వివరణ కోరితే ఉత్తర్వులు తమకు ఇంకా నేరుగా అందలేదని, ఉత్తర్వులు అందిన తరువాత అందులో ఏం ఉంటే దానినే అమలు చేస్తామని చెబుతున్నారు. సాక్షాత్తూ జలవనరుల శాఖ రాష్ట్ర కార్యదర్శి విడుదల చేసిన జీఓను అమలు చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. జాప్యం వెనుక రాజకీయ కారణాలున్నట్లు తెలుస్తోంది. జీఓను వెనక్కు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. దీనికి అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఓ ఎమ్మెల్సీ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు ఆ శాఖలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యదర్శి జీఓ అమలు కాకుండా అడ్డుకుంటున్నది ప్రభుత్వంలో ఉన్నవారే కావడం విశేషం.