2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం
ఏవైనా ఇబ్బందులెదురైతే మరో ఏడాది పొడిగింపు
అంతర్జాతీయ నిపుణుల నివేదికను అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాంలు పూర్తి
దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో ఒకే సీజన్‌లో కొత్తది నిర్మాణం
ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణం వేగంగా పూర్తి చేసే అవకాశం
అందుకే కేంద్రం రెండేళ్ల గడువు పెట్టిందంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.
అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.
వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్‌ను ఒకే సీజన్‌లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.
41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్
కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తి చేయాలి.
ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు.
తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు.
ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment