అదనంగా రూ.1,561 కోట్ల రుణ పరిమితి
ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి 3.25 శాతానికి పెంచిన కేంద్రం
* రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ అంచనాల్లో కోత
* వార్షిక రుణాల పరిమితి రూ.20,293 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) చట్టం కింద రాష్ట్ర రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇంతకు ముందు 3 శాతంగా ఉన్న పరిమితిని 3.25 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1,561 కోట్ల మేర రుణాలు తెచ్చుకునే వెసులుబాటు లభిం చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.50 శాతానికి పెంచాలని కోరినా.. 3.25 శాతానికే పెంచడం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది.
ఇప్పటివరకు 3 శాతం
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాలు తమ జీఎస్‌డీపీలో గరిష్టంగా 3 శాతం మేర రుణాలు తెచ్చుకోవచ్చు. అయితే కొత్త రాష్ట్రం కావటంతో 3.5 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ప్రధాని మోదీని కలసి విజ్ఞప్తి చేయడంతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రానికి, నీతి ఆయోగ్‌కు లేఖలు కూడా రాశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు అవసరమైన నిధుల కోసం రుణ పరిమితిని పెంచాలని కోరారు.
మరోవైపు దేశంలో గుజరాత్ తర్వాత రెవెన్యూ మిగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని.. రెవెన్యూ మిగులు రాష్ట్రాలకు రుణ పరిమితిని పెంచాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందున ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపునకు అవసరమైన అర్హతలు తెలంగాణకు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచేందుకు ఏప్రిల్‌లో పచ్చజెండా ఊపిన కేంద్ర కేబినెట్.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది.
రుణ అంచనాలకు గండి
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఆశించినంత పెరగకపోవడంతో ప్రభుత్వం వేసుకున్న రుణ అంచనా తగ్గిపోయింది. 2016-17 బడ్జెట్‌లో సర్కారు రూ.23,467.29 కోట్లు ద్రవ్యలోటు చూపింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 3.5 శాతంగా లెక్కగట్టి, ఆ మేరకు రుణాలు తెచ్చుకుంటామని ప్రతిపాదించింది. కానీ కేంద్రం నిర్ణయంతో 0.25 శాతం మేర రుణ అంచనా తగ్గనుంది. గతేడాదితో పోలిస్తే కేవలం రూ.1,561 కోట్లు అదనంగా రుణం తెచ్చుకునే వెసులుబాటు లభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఇప్పటికే జీఎస్‌డీపీ గణాంకాలను కేంద్రం సవరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకున్న రుణాల్లో రూ.1,613 కోట్ల మేర కోత పడింది. 2016-17లో జీఎస్‌డీపీ పెరుగుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.23,467.29 కోట్ల ద్రవ్యలోటు చూపింది. కానీ జీఎస్‌డీపీని ఎక్కువగా అంచనా వేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనిని కేంద్రమే సరిచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో అంచనాలను సవరించారు. తాజా లెక్కలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణాల పరిమితి రూ.20,293 కోట్లకు పరిమితమవుతుందని తెలుస్తోంది.
ఏమిటీ ఎఫ్‌ఆర్‌బీఎం?
అప్పుల ఊబి నుంచి బయటపడటం, దేశం లో ద్రవ్యలోటును తగ్గించడం, స్థూల ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన బడ్జెట్‌లకు రూపకల్పన చేయడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2003లో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం-2003ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రాలన్నీ ఆ చట్టం నిర్దేశించిన పరిమితికి లోబడే అప్పులు చేయాలి. ఇప్పటివరకు రాష్ట్రాలన్నీ తమ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గరిష్టంగా 3% మేరకు అప్పులు తెచ్చుకోవచ్చు. తాజాగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.25 శాతానికి పెంచారు. మిగతా రాష్ట్రాలకు పాత పరిమితే వర్తిస్తుంది.