
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి రుణ పరిమితి పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతం మేరకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.3574 కోట్లు నికర అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం సీలింగ్ ప్రకారం వివిధ రుణ సంస్థల నుంచి రూ.21,445 కోట్లు అప్పులు తెచ్చుకునే వీలుంది. పెంచిన పరిమితితో ఈ సీలింగ్ రూ.25,019 కోట్లకు చేరుతుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్రాలు స్థూల ఉత్పత్తి ఆదాయం (జీఎస్‌డీపీ)లో 3 శాతం మించి అప్పులు తెచ్చుకోవడానికి వీల్లేదు.
కానీ భారీగా రెవిన్యూ, మిగులు ఆదాయమున్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సడలించే వెసులుబాటు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచేందుకు ఆయా రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణతో పాటు కీలకమైన మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెవిన్యూ మిగులు ఉండటం, రాష్ట్ర రెవిన్యూలో వడ్డీల చెల్లింపు పది శాతానికి మించకుండా ఉండటం, ఇప్పటికే తీసుకున్న అప్పులు సైతం జీఎస్‌డీపీలో 25 శాతం మించకూడదనే నిబంధనలను పొందుపరిచింది.
ఈ మూడు అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం సూచించిన అర్హతలన్నీ సాధించిందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం గత ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 0.5 శాతం మేరకు పెంచింది. ఈ ఏడాది సైతం ఆదాయ వృద్ధి అదేతీరుగా కొనసాగటం, వడ్డీల చెల్లింపులు, అప్పులు నిబంధనలకు లోబడి ఉండటంతో కేంద్రం మరోసారి ఈ పరిమితిని సడలించింది.
Comments
Please login to add a commentAdd a comment