ఎఫ్ఆర్ బీఎం పరిమితి సడలింపునకు ఓకే | Frbm limit relaxation okay | Sakshi
Sakshi News home page

ఎఫ్ఆర్ బీఎం పరిమితి సడలింపునకు ఓకే

Published Fri, Jan 29 2016 3:51 AM | Last Updated on Sat, Oct 20 2018 5:49 PM

ఎఫ్ఆర్ బీఎం పరిమితి సడలింపునకు ఓకే - Sakshi

ఎఫ్ఆర్ బీఎం పరిమితి సడలింపునకు ఓకే

కేబినెట్ నోట్ సిద్ధమైందన్న అధికారులు
ఇది ఆమోదం పొందితే రూ.2,500 కోట్ల రుణానికి వెసులుబాటు

పెండింగ్ అంశాలపై సమీక్షించిన నీతి ఆయోగ్
హాజరైన కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు

 సాక్షి, న్యూఢిల్లీ: రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి సడలింపునకు అనుమతి ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేబినెట్ నోట్ తయారైందని కేంద్ర ఉన్నతాధికారులు చెప్పారు. త్వరలోనే ఆమోదం పొందే అవకాశం ఉందన్నారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3 శాతానికి మించి అప్పులు ఉండరాదని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశిస్తోంది. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు దీనిని మరో 0.5 శాతం పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినందున నిబంధనలు సడలించాలని తెలంగాణ ప్రభుత్వం చాలాసార్లు కేంద్రానికి విన్నవించింది.

 తాజాగా నీతిఆయోగ్ గురువారం కేంద్రం వద్ద తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను చర్చించేందుకు వీలుగా సమీక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరైన ఈ తరహా సమీక్ష సమావేశం ఇదే మొదటిది. ఇకపై నీతిఆయోగ్ అన్ని రాష్ట్రాల పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించనుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అధ్యక్షతన జరిగిన సమీక్షలో వివిధ శాఖల కేంద్ర ఉన్నతాధికారులు, తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు హాజరయ్యారు.

ఈ విషయాలను రామచంద్రు మీడియాకు వివరిస్తూ.. ఎఫ్‌ఆర్‌బీఎంను కేబినెట్ ఆమోదిస్తే తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ. 2,500 వేల కోట్లు రుణం తీసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన గ్రాంట్లు రూ. 778 కోట్లను కేంద్రం నిరాకరించిందని, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం విడుదల చేశారని ప్రస్తావించారు. దీనిపై పరిశీలిస్తామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు.

నూతన విధానం ప్రకారం లింకేజీ
ఇంధన శాఖకు సంబంధించి విద్యుత్తు ప్లాంట్లకు కోల్ లింకేజీపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదిత, అమలులో ఉన్న యూనిట్లకు కొత్త లింకేజీ విధానం ప్రకారం బొగ్గు బ్లాకులు కేటాయించనున్నట్టు కేంద్ర అధికారులు చెప్పారు. ప్రతిపాదిత నేదునూరు (కరీంనగర్), శంకరపల్లి (రంగారెడ్డి జిల్లా) గ్యాస్ విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపు జరపాలని కోరగా.. దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఇవ్వడం కష్టమని బదులిచ్చారు.

విదేశీ మార్కెట్లలో గ్యాస్ ధర తక్కువగా ఉన్నందున దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కోరగా, సహకరిస్తామని కేంద్రం చెప్పింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని తాము చేసిన బీపీఎల్ సర్వే ఆధారంగా ఇళ్ల లబ్ధిదారులను గుర్తించాలని రాష్ట్రం కోరగా.. సామాజిక, ఆర్థిక, కుల గణన ఆధారంగానే ఎంపిక చేస్తామని కేంద్రం బదులిచ్చింది. దీనిని మరోసారి పరిశీలించాలని రాష్ట్రం కోరింది. సమావేశంలో ఉన్నతాధికారులు ప్రదీప్ చంద, బీపీ ఆచార్య, దాన కిశోర్, బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement