ఉల్టా షాకిచ్చిన కేంద్రం | Debt Relief goal DISCOMs | Sakshi
Sakshi News home page

ఉల్టా షాకిచ్చిన కేంద్రం

Published Fri, Nov 6 2015 3:09 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

ఉల్టా షాకిచ్చిన కేంద్రం - Sakshi

ఉల్టా షాకిచ్చిన కేంద్రం

* విద్యుత్ బాండ్ల బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ
* డిస్కంలను రుణ విముక్తి చేసే ప్యాకేజీకి నిర్ణయం
* తేల్చిచెప్పిన కేంద్రం... తెలంగాణపై రూ.4,500 కోట్ల భారం
* ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి సడలించినా.. డిస్కంల అప్పు తీర్చాలనే షరతు
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా... తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఉల్టా షాక్ ఇచ్చింది. కొత్త అప్పు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సడలించాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో 4,500 కోట్ల రూపాయల చిక్కుల్లో పడేసింది.

విద్యుత్తు బాండ్ల రూపంలో గతంలో డిస్కంలు తీసుకున్న అప్పులను... రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేయాలని  కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అప్పు సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ఆర్థిక శాఖ తల పట్టుకుంటోంది. తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.4 లక్షల కోట్లు. ఈ ఏడాదిలో  12 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే వీలుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్రాలు తెచ్చుకునే అప్పు జీఎస్‌డీపీలో మూడు శాతానికి మించకూడదు. కానీ.. మిగులు రాష్ట్రమైనందున ఈ రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇప్పటికీ ఈ పరిమితి సడలించే విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఉలుకూ పలుకు లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అశనిపాతంగా మారింది.
 
డిస్కంల రుణవిముక్తి లక్ష్యం
ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ (ఎఫ్‌ఆర్‌పీ) లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కంల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ ప్యాకేజీలో భాగంగా డిస్కంలపై ఉన్న అప్పుల భారాన్ని తీర్చాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లోని డిస్కంలలో ఉన్న అప్పుల బకాయిలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు టేకోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

విద్యుత్ చార్జీల సబ్సిడీలు, గ్రాంట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిస్కంలు విద్యుత్ బాండ్ల ద్వారా అంతమేరకు నిధులు సమకూర్చుకున్నాయి. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ఈ బాండ్లపై దాదాపు 4,500 కోట్ల రూపాయల అప్పుల భారం పేరుకుపోయింది. అడపాదడపా రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని విడుదల చేస్తోంది.
 
చిక్కుల్లో రాష్ట్ర ఖజానా
కేంద్రం తాజా నిర్ణయంతో ఈ బకాయిల భారం ఇకపై డిస్కంల ఖాతాలో నుంచి.. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి చేరుతుంది. డిస్కంల పరిధిలో ఉండగా ఈ అప్పు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాలేదు. కానీ.. బకాయిల భారం బదిలీతో రాష్ట్ర అప్పుల పరిమితి ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను దాటిపోయే ప్రమాదముంది.

దీంతో తెలంగాణ ఆర్థిక శాఖ తలపట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది మార్కెట్లో బాండ్ల విక్రయం ద్వారా తెచ్చుకున్న అప్పు దాదాపు రూ.10 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో విద్యుత్తు బాండ్ల బకాయిలు ఇందులో చేరితే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటిపోనుంది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిని సడలింపుకు అనుమతించినా.. అంతమేరకు డిస్కంల అప్పుల భారాన్ని తీర్చేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనను తెలంగాణ ఆర్థిక శాఖ ముందుంచినట్లు తెలిసింది.

దీంతో ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో లాక్కున్నట్లుగా కేంద్రం వ్యవహారం ఉందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచితే.. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుల రుణమాఫీ, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు సర్దుబాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ  సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఈలోగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక అంచనాలను తలకిందులు చేసినట్లయిందని.. ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement