సాక్షి, అమరావతి/అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం క్రైం: భావప్రాప్తి కోసం ఈనాడు రామోజీరావు తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్నారు. ఎంత నీచానికి దిగజారకూడదో అంతకన్నా హీనంగా అథఃపాతాళంలోకి ఆయన రోజురోజుకీ కూరుకుపోతున్నారు. కారణం.. తన ఆత్మ చంద్రబాబుపై అంతులేని ప్రేమ.. సీఎం జగన్‌పై ఎక్కడాలేని అసూయ, విద్వేషం. దీంతో ఆయన సిగ్గూఎగ్గూ వదిలేసి తన విషపుత్రిక ఈనాడులో నిత్యం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.
అందులో భాగమే టీచర్ మల్లేష్ ఆత్మహత్యా యత్నం కథనం కూడా. వ్యక్తిగత కారణాలతో పాటు విపరీతమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి అవి చెల్లించలేని దుస్థితిలో ఆత్మహత్యాయత్నానికి అతను పాల్పడితే రామోజీ ఆ ఉదంతాన్ని కూడా బాబు కోసం, తన పైశాచికానందం కోసం వాడేసుకున్నారు. ఈ ఘటనపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే..
అనంతపురం జిల్లా ఉరవకొండలో వ్యక్తిగత కారణాలతో టీచర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడితే ఆ ఘటనను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, సీపీఎస్‌కు ముడిపెట్టి రామోజీ వికృతానందం పొందారు. నిజానికి.. 2003లో సీపీఎస్‌ను కేంద్రం రద్దు చేసినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది చంద్రబాబే. అంతేకాదు.. నాటి కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కూడా. అందులో ఆయన మంత్రులు సైతం ఉన్నారు. అప్పట్లో ఈ రద్దు నిర్ణయాన్ని వీరెవరూ వ్యతిరేకించలేదు. పైగా.. 2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక కూడా సీపీఎస్‌కు సంబంధించి ఎలాంటి నిర్ధిష్ట నిర్ణయం తీసుకోకుండా అలా గాలికి వదిలేశారు.
ఈ వివరాలన్నింటినీ రామోజీ ఉద్దేశపూర్వకంగా తన కథనంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీకి తోడు సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ చాలా తక్కువ వస్తోందని సీఎం వైఎస్ జగన్ గుర్తించి వారికి మెరుగైన పెన్షన్ కోసం.. అలాగే, దానికొక శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆలోచించి ఆయన గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్)కు రూపకల్పన చేశారు. దీని ప్రకారం.. ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగి పదవీ విరమణకు ముందునెల పొందే మూల వేతనంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా జీపీఎస్‌ను తీసుకొచ్చి సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేశారు. దీనిని ఉద్యోగ సంఘాలు సైతం స్వాగతించాయి.
ఇంతకంటే గొప్ప ప్రత్యామ్నాయంలేదని ఉద్యోగులంతా హర్షం వ్యక్తంచేశారు. చివరికి కేంద్రం కూడా ఇప్పుడు దీనిని అధ్యయనం చేస్తుండడమే కాక అన్ని రాష్ట్రాలూ ఈ విధానాన్నే అనుసరించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. టీచర్ మల్లేష్ ఆత్మహత్యా యత్నానికి సీఎం జగన్ సీపీఎస్ రద్దు చేయకపోవడమే కారణమంటూ రామోజీ గుడ్డిగా ఒక నిర్ణయానికొచ్చేసి బాబుకు మేలు జరిగేలా తనకు తోచింది రాసిపారేశారు. ఇందుకు టీడీపీ నేతలు సైతం తోకలూపుతూ నీచ రాజకీయాలకు దిగారు.
జగన్ సర్కారును అభాసుపాల్జేయడమే పని..
ఇక 1996 నుంచి 2004 వరకు అప్పటి కేంద్రంలోని ఎన్‌డీఏలో తానే చక్రం తిప్పానని పదేపదే గొప్పలు చెప్పుకున్న బాబు.. ఆనాడు సీపీఎస్‌ను ఎందుకు వ్యతిరేకించలేదు? పైగా.. రాష్ట్రంలో అమలుచేసేందుకు 2003లో ఆమోదం కూడా తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం సీపీఎస్‌ను రద్దుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సమయంలో సీపీఎస్ రద్దు సాధ్యంకాదని తెగేసి చెప్పారు.
కానీ, 2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్ రద్దు హామీ ఇవ్వడంతో ఇక గతిలేక ఎన్నికల ముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సత్యప్రకాశ్ ఠక్కర్‌తో చంద్రబాబు కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. నిజంగా చంద్రబాబుకు సీపీఎస్ ఉద్యోగులపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే తన ఐదేళ్ల పాలనలో మెరుగైన పెన్షన్ కోసం ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? బాబు చేసిన ఈ మోసాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేసిన జగన్ సర్కారును అభాసుపాల్జేయడమే పనిగా ఈనాడు రామోజీ పెట్టుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు నిజమే.. కానీ, ప్రభుత్వంపై అసంతృప్తిలేదు
నా భర్త ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడో తెలీదు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ, ఈ ఘటనను కొందరు పని కట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మా ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డిప్రెషన్‌లో ఏమి రాశాడో, ఎవరికి పోస్ట్ చేశాడో మాకు తెలీడంలేదు. దయచేసి దీనిపై రాజకీయం చేయొద్దు.
నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం మెసేజ్ వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. నిజానికి.. మాకెవరికీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే మాకు చాలా అభిమానం. జగన్ పాలనలోనే నాకు సచివాలయం ఏఎన్‌ఎంగా ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. నా భర్తను కాపాడుకునేందుకు అందరూ సహకరించాలి.
– శివలక్ష్మి, టీచర్ మల్లేష్ భార్య
రూ.25.60 లక్షల అప్పుల్లో మల్లేష్..
వాస్తవాలిలా ఉంటే.. ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు ఇటీవల బెట్టింగ్‌లో రూ.ఆరు లక్షలు కోల్పోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఎం జగన్ సీపీఎస్ రద్దుచేయనందువల్లే ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఈనాడు రామోజీ మసిపూసి మారేడుకాయ చేశారు.
అంతేకాదు.. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన టీచర్ మల్లేష్ రూ.25.60 లక్షల అప్పుల్లో కూడా కూరుకుపోయిన నిజాన్ని ఈనాడు మరుగునపరిచి కేవలం సీపీఎస్ రద్దు చేయనందువల్లే అంటూ ఇష్టారాజ్యంగా రాసిపారేసింది. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటనలకు సీపీఎస్ అంశాన్ని ముడిపెట్టి రామోజీ, టీడీపీ నేతలు పైశాచికానందం పొందుతున్నారు. మరోవైపు.. 35 ఏళ్ల టీచర్ మల్లేష్‌కు ఇంకా చాలా సర్వీసు ఉంది. అంత సర్వీసు ఉండగా సీపీఎస్ రద్దుచేయలేదని ఇప్పుడే ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడతారనే కనీస స్పృహ, ఇంగిత జ్ఞానం రామోజీకి కరువైంది.
అప్పులున్నాయి.. అవి చెల్లించకపోవడంవల్లే..
మల్లేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రుణాలు తీసుకున్నాడు. అవి సక్రమంగా చెల్లించకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడేవాడు. అనవసరంగా ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలకు నా బావకూ ఎలాంటి సంబంధంలేదు.
– ఆదినారాయణ, శివలక్ష్మి సోదరుడు
వ్యక్తిగత ఇబ్బందులవల్లే ఆత్మహత్యాయత్నం
వ్యక్తిగత ఇబ్బందుల నేపథ్యంలోనే టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. మల్లేష్ తన కుటుంబంతో పాటు సోదరి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆయన సుమారు రూ.26 లక్షలకు పైగా అప్పులుచేశాడు. వాటిని తీర్చేమార్గం కనిపించక ఇబ్బందులు పడేవాడు. దీనికితోడు బ్యాంకులు, చిట్‌ఫండ్ కంపెనీల్లో రుణాలు తీసుకోవడంతో అన్నింటికీ నెలవారీ చెల్లింపులు కష్టంగా మారింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. మల్లేష్ పూర్తిగా స్పృహలోకి రాగానే మరిన్ని విషయాలు తెలుస్తాయి.
– మీడియాతో ఉరవకొండ సీఐ ఎం. తిమ్మయ్య
జీతాలు సకాలంలోనే అందుతున్నాయి
వ్యక్తిగత కారణాలతో ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దురదృష్టకరం. మల్లేష్ ఘటనపై కొన్ని సంఘాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కావాలనే ప్రభుత్వానికి ఆపాదించి దుష్ప్రచారం చేస్తున్నాయి. మల్లేష్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు అసంబద్ధంగా ఉన్నాయి. మల్లేష్‌కు అనారోగ్య కారణాలు ఉన్నాయని, వీటికి తోడు ఆర్థిక సమస్యలు కూడా తోడయ్యాయని ఆయన భార్య బహిరంగంగానే చెప్పారు. నిజానికి.. 2020–21 కరోనా సమయంలోనూ ప్రతినెలా 4న ఉపాధ్యాయుల వేతనాలు అందాయి.
ఇప్పుడూ ప్రతినెలా 6వ తేదీ లోపలే అందుతున్నాయి. కావాలంటే పే స్లిప్పులు పరిశీలించాలి. పీఎఫ్, జీపీఎఫ్ లోన్లు ఈ ఏడాది ఏప్రిల్ వరకు క్లియర్ చేశారు. ప్రభుత్వోద్యోగులపై సీఎం వైఎస్ జగన్‌కు ఎలాంటి వ్యతిరేకతా లేకున్నా ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయాలని ప్రయత్నిస్తున్నారు. మల్లేష్ రాసినట్లు చెబుతున్న లేఖ కూడా ఆయన రాసింది కాదని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు.
– అశోక్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment