
7.20% వడ్డీతో మరో రూ.1,000 కోట్లు అప్పు తెచ్చిన బాబు సర్కారు
ఇప్పటివరకు బడ్జెట్ పరిధిలో, బడ్జెట్ బయట తెచ్చిన అప్పు రూ.1.35 లక్షల కోట్లు
బడ్జెట్ పరిధిలో చెప్పిన దానికి మించి రూ.20 వేల కోట్లు అదనంగా అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి సున్నా. అప్పులు మాత్రం తెగ పెరిగిపోతున్నాయి. వారం వారం, నెల నెలా తెస్తున్న అప్పులతో ఏడాది తిరగకుండానే బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఏకంగా రూ.1,35,640 కోట్లు అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 హామీలు అమలు చేయడంలేదు. సూపర్6 లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి ఊసే ఎత్తడంలేదు. మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా 7.20 శాతం వడ్డీకి రూ.1,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది.
దీంతో బడ్జెట్ పరిధిలోనే మార్కెట్ రుణాల ద్వారా తెచ్చిన అప్పులు రూ.89,940 కోట్లకు చేరాయి. బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరం రూ.70 వేల కోట్ల అప్పు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది. కానీ, ఆర్థికఏడాది ముగియడానికి నెల రోజులుండగానే బడ్జెట్‌లో చెప్పిన దానికన్నా అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ బయట కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు.
రాజధాని పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు మొత్తం రూ. 31 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకు ఉత్తర్వులనూ జారీ చేసింది. రాజధాని పేరుతో, కార్పొరేషన్లకు గ్యారెంటీల ద్వారా రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది. ఇవే కాకుండా కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం.
ఏ ప్రభుత్వమూ ఇంత అప్పు చేయలేదు
ఒక్క ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు బాబు బృందం రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి భారీగా అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా నోరు మెదపడంలేదు.
ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం జనవరికి రూ.10,853 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు తెలిపాయి. ఆస్తుల కల్పనకు ఖర్చు చేయకుండా, సూపర్ 6 హామీలూ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడంలేదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment