సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ పాలనలో సృష్టించిన ఆస్తులు బావా, బావమరుదల స్వేదంతో సృష్టించినవా? ఆ సర్కారు హయాంలో చేసిన అప్పు లు చెల్లించేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రజల స్వేదం చిందించాల్సిందే కదా? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘ఏదో సాధించినట్టు స్వేదపత్రం విడుదల చేశారు. బావా బావమరుదులు కష్టపడి చెమటలు చిందించి సంపాదించినట్టు చెబుతున్నారు.
అవి తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆస్తులు. అదే చెమటను చిందించి అప్పులను కట్టాల్సిందే. ఇందులో బీఆర్‌ఎస్ గొప్పతనమేముంది.?’అని నిలదీశారు. మంగళవారం ఢిల్లీ వెళ్లేందుకు ముందు బేగంపేట విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో భట్టి మాట్లాడారు. బీఆర్‌ఎస్ స్వేదపత్రంపై ఘాటై న విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ. 7లక్షల కోట్లు అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమో కాదో చెప్పాలన్నారు
దోపిడీ సొమ్మును కక్కిస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ అవినీతి సొమ్మును కక్కిస్తామని ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ చెప్పినట్టుగానే గత ప్రభుత్వ అక్రమాలపై న్యాయ విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించిందని భట్టి చెప్పారు. ఈ విచారణ తర్వాత లెక్కలు కట్టి దోపిడీ సొమ్మును కక్కిస్తామని వ్యాఖ్యానించారు.
ధనవంతులు మరింత సంపన్నులయ్యారు
బీఆర్‌ఎస్ పాలనలో పేదలు మరింత పేద లుగా మారితే ధనవంతులు మరింత సంపన్నులయ్యారని, దీనికి తామేదో తలసరి ఆదాయం పెంచామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని భట్టి విమర్శించారు. ‘హైదరాబాద్‌లో ఓ సంపన్నుడు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. గ్రామాల్లో పేదలు 40 చదరపు గజాల్లో ఉంటున్నారు. వారిద్దరి తలసరి ఆదాయం సగటును లెక్కించి గొప్పలు చెప్పుకోవడం సమంజసమేనా.?’అని నిలదీశారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? కొత్తగా పరిశ్రమలు తెచ్చారా? కోల్ ఇండస్ట్రీ నెలకొల్పారా? ప్రభుత్వరంగ సంస్థలేమైనా తెచ్చారా? వీళ్లు సృష్టించిన ఆస్తులేంటి? కళ్లకు కనపడవా?’అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment