పరుగెడుతున్న తెలంగాణ అప్పుల పద్దు.. ఆదాయంలో మూడో వంతు అప్పులే! | Telangana Government Report to CAG On State Income and Debts | Sakshi
Sakshi News home page

పరుగెడుతున్న తెలంగాణ అప్పుల పద్దు.. ఆదాయంలో మూడో వంతు అప్పులే!

Jul 13 2023 5:05 AM | Updated on Jul 13 2023 10:25 AM

Telangana Government Report to CAG On State Income and Debts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు పరుగెడుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి రెండు నెలల ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే రాష్ట్ర మొత్తం ఆదాయంలో మూడో వంతు అప్పులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కలిపి మొత్తం రూ.31,699 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.9,266 కోట్లు అప్పులే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడైంది. ఇక వచ్చిన ఆదాయంలో దాదాపు 95 శాతం ఖర్చయిపోయింది. ఈ రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ.28,171 కోట్లు అని ఈ నివేదిక వెల్లడించింది.  

పన్ను ఆదాయం రూ.20,097 కోట్లు  
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.52 లక్షల కోట్ల పన్ను ఆదాయం  వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 13.18% తొలి రెండు నెలల్లో సమకూరింది. అన్ని రకాల పన్నులు కలిపి రూ.20,097 కోట్లు వచ్చినట్టు తేలింది. జీఎస్టీ కింద రూ.7,430 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,358 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ.4,802 కోట్లు, ఎక్సైజ్‌ ద్వారా రూ.2,683 కోట్లు, ఇతర పన్నుల నుంచి రూ.1,327 కోట్లు వచ్చాయి.

ఇక పన్నేతర ఆదాయం అంచనాల్లో 4 శాతం అంటే రూ. 891.47 కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి రెండు నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా గ్రాంట్లు వచ్చాయి. అందులో పన్నుల్లో వాటా కింద రూ.1,494 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.1,438 కోట్లు వచ్చాయి.  

వడ్డీలకు రూ.3,200 కోట్లు 
ఖర్చుల విషయానికి వస్తే వేతనాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల రూపంలో సింహభాగం ఖర్చయ్యాయి. వేతనాలకు రూ.6,784 కోట్లు, పింఛన్లకు రూ.2,779 కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ.3,205 కోట్లు చెల్లించారు. సబ్సిడీల రూపంలో రూ.1,923 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.6,692 కోట్లు ఖర్చయ్యాయి. అన్ని రంగాల్లో కలిపి మూలధన వ్యయం కింద రూ.6,800 కోట్ల వరకు ఖర్చయ్యాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement