Controller of the Auditor General
-
పరుగెడుతున్న తెలంగాణ అప్పుల పద్దు.. ఆదాయంలో మూడో వంతు అప్పులే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు పరుగెడుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి రెండు నెలల ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే రాష్ట్ర మొత్తం ఆదాయంలో మూడో వంతు అప్పులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కలిపి మొత్తం రూ.31,699 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.9,266 కోట్లు అప్పులే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడైంది. ఇక వచ్చిన ఆదాయంలో దాదాపు 95 శాతం ఖర్చయిపోయింది. ఈ రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ.28,171 కోట్లు అని ఈ నివేదిక వెల్లడించింది. పన్ను ఆదాయం రూ.20,097 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.52 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 13.18% తొలి రెండు నెలల్లో సమకూరింది. అన్ని రకాల పన్నులు కలిపి రూ.20,097 కోట్లు వచ్చినట్టు తేలింది. జీఎస్టీ కింద రూ.7,430 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,358 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ.4,802 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.2,683 కోట్లు, ఇతర పన్నుల నుంచి రూ.1,327 కోట్లు వచ్చాయి. ఇక పన్నేతర ఆదాయం అంచనాల్లో 4 శాతం అంటే రూ. 891.47 కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి రెండు నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా గ్రాంట్లు వచ్చాయి. అందులో పన్నుల్లో వాటా కింద రూ.1,494 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1,438 కోట్లు వచ్చాయి. వడ్డీలకు రూ.3,200 కోట్లు ఖర్చుల విషయానికి వస్తే వేతనాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల రూపంలో సింహభాగం ఖర్చయ్యాయి. వేతనాలకు రూ.6,784 కోట్లు, పింఛన్లకు రూ.2,779 కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ.3,205 కోట్లు చెల్లించారు. సబ్సిడీల రూపంలో రూ.1,923 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.6,692 కోట్లు ఖర్చయ్యాయి. అన్ని రంగాల్లో కలిపి మూలధన వ్యయం కింద రూ.6,800 కోట్ల వరకు ఖర్చయ్యాయి. -
కడిగేసిన కాగ్
ఆస్పత్రి అభివృద్ధి కమిటీల పనితీరుపై ఆగ్రహం ఖాతాల నిర్వహణ తీరుపై అభ్యంతరం అర్హత లేని వ్యక్తికి రూ.10 లక్షలు చెల్లించారంటూ చురక సిటీబ్యూరో: ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల పనితీరుపై కాగ్(కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి మూడునెలలకు ఒకసారి కమిటీల సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం ఆరునెలలైనా సమావేశాల ఊసెత్తడం లేదని పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వ నిజామియా జనరల్ (యునాని)ఆస్పత్రి హెచ్‌డీసీ ఖాతాలో ల క్షల నిధులు మగ్గిపోతున్నట్లు తెలిపింది. దీనికితోడు ప్రతిష్టాత్మకమైన గాంధీ, ఉస్మానియా తదితర బోధనాస్పత్రుల్లోనూ ఖాతాల నిర్వహణ సక్రమంగా లేదని, ఇప్పటి వరకు చార్టెర్డ్ అకౌంటెంట్‌తో ఆడిట్ చేయించక పోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈఎమ్‌డీ, ఎస్డీ రిజిస్ట్రర్ సరిగా నిర్వహించక పోగా అర్హత లేని వ్యక్తికి రూ.10 లక్షల ఈఎమ్‌డీ చెల్లించినట్లు పేర్కొంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కాక్లీయర్ ఇంప్లాంట్ సర్జరీల కోసం కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టినట్లు స్పష్టం చేసింది. తొమ్మిది మంది ఏవీ థెరపీ కోసం దరఖాస్తు చేసుకోగా, ట్రస్ట్ నుంచి రూ .5.80 లక్షలు డ్రా చేసుకున్నప్పటికీ లబ్దిదార్ల పేర్లు ఏవీ థెరపీకి సంబంధించిన హాజరు పట్టికలో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతీయ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం నెలకు 20 కన్నా ఎక్కువ ప్రసవాలు జరిగే పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యాధికారులు, నలుగురు స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా, నగరంలోని ఆరోగ్య కేంద్రాల్లో 88 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. నగరంలో రక్తనిధి కేంద్రాల నిర్వహణపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రక్తం సేకరణ, నిల్వ, సరఫరాలో సరైన ప్రమాణాలు పాటించడం లేదన్నారు. రక్త నిల్వలపై సెంట్రల్ ఆన్లైన్ డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలని 2011లోనే సూచించినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.