
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్‌షాపులు తెరుస్తున్నారంటూ శనివారం మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం ఒక రకంగా సంచలనానికి దారి తీసింది. ఈనెల 29 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వైన్‌షాపులు తెరుస్తున్నారని, ప్రతి షాపు దగ్గర ఐదుగురు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు కాపలా ఉంటారని వాట్సాప్‌లో వచ్చిన ఫేక్ డాక్యుమెంట్ క్షణాల్లో వైరల్ అయింది. అలా వాట్సాప్‌లోకి వచ్చిందో లేదో నిమిషాల్లో వందలు, వేల వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో మళ్లీ మద్యం గురించి చర్చ మొదలైంది.
మద్యం కోసం తహతహలాడుతున్న మందు బాబులు మళ్లీ వైన్‌షాపులు తెరుస్తున్నారన్న ఆశతో తమ సహచరులు, సన్నిహితులు, మీడియా వ్యక్తులకు ఫోన్లు చేసి ఆరా తీశారు. అయితే వాట్సాప్‌లో ఈ ఫేక్ సమాచారం ఎంత వేగంగా ప్రచారమైందో అంతే వేగంగా ఎక్సైజ్ అధికారులు కూడా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన డాక్యుమెంట్ నకిలీదని, శాఖా పరంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారికంగా వివరణ ఇచ్చారు. పైగా నకిలీ పోస్టును ప్రచారం చేసిన వారిపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈజీ కాదు
రాష్ట్రంలో మద్యం తాగేవారి సంఖ్య దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మందు దొరక్కపోవడంతో ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరుస్తారా అనే ఆశతో మందుబాబులు ఎదురుచూస్తున్నారు. మందు కోసం వీరంతా రోజూ ఏదోలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన నకిలీ డాక్యుమెంట్ వీరిలో లేనిపోని ఆశలు కల్పించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి షాపులు తెరిస్తే నియంత్రించడం కష్టమవుతుందని, అలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో మద్యం దుకాణాలు తెరవడం జరిగే పని కాదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.
అవసరమైన వారికి మద్యం ఇంటికే సరఫరా చేసేందుకు కసరత్తు జరుగుతుందన్న వార్తల్లో కూడా వాస్తవం లేదని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలపై సీఎం కేసీఆర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారుల చేతిలో ఈ నిర్ణయం ఉండదని, ఒక్కసారి నిత్యావసరాల చట్టం అమల్లోకి వచ్చాక శాఖల చేతిలో ఏమీ ఉండదని, సీఎం సూచన మేరకు ఉన్నత స్థాయిలోనే నిర్ణయం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది ఒక్క ఎక్సైజ్ శాఖకే కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకూ ఇదే నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ నకిలీ డాక్యుమెంట్ తయారుచేసిన వారిపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. ఈ వదంతులను పంపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఆర్మీ రావడం అవాస్తవం: డీజీపీ
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జన సంచారాన్ని నియంత్రించేందుకు సైన్యం రంగంలోకి దిగిందన్న ప్రచారాన్ని డీజీపీ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో ఖండించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను నియంత్రించడానికి రాష్ట్ర బలగాలు సరిపోతాయని, అదనపు బలగాలు, ఆర్మీని పంపాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపింది.
మరికొన్ని ఫేక్‌న్యూస్‌ల హల్‌చల్
కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ కొందరు తప్పుడు పోస్టులు పెడుతున్నారు. కరోనా నియంత్రణకు అనుమానితులను చైనా కాల్చేసిందని, రష్యా రోడ్లపై సింహాలను వదిలిందంటూ కొన్ని ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జన సంచారం నియంత్రణకు ఆర్మీ వస్తోందని పాత వీడియోలు షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment