సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా గుప్పుమంటోంది. లాక్‌డౌన్ వేళ గ్రామీణ ప్రాంతాల్లో సారా బట్టీల మంటలు రాజుకుంటున్నాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ నాటి నుంచి సోమవారం వరకు 1,600 గుడుంబా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో గుడుంబా ‘కాగిన’ సమయంలో ఒక్క నెలలో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఈ 40 రోజుల్లో అన్నే కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అందుబాటులో లేకపోవడంతో మళ్లీ గుడుంబా వైపు అడుగులు పడుతుండగా, దాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక ఎక్సైజ్ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.
కేసుల్లేని జిల్లా లేదు..
లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేశారు. అయినా పట్టణ ప్రాంతాల్లో ఎలాగోలా మందు లభ్యమవుతుండగా, పల్లెల్లో సరుకు దొరకట్లేదు. దీంతో అనివార్యంగా మళ్లీ గ్రామాల్లోని ప్రజలు గుడుంబా వైపు చూస్తున్నట్టు ఎక్సైజ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 26 వరకు 1,600 గుడుంబా కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,019 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా, 1.15 లక్షల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20వేల లీటర్లు, వరంగల్‌లో 17వేలు, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 15వేల చొప్పున, రంగారెడ్డిలో 8వేలు, నల్లగొండలో 7వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ గుడుంబా కేసులు నమోదయ్యాయి.
తయారీకి కారణాలనేకం..
రాష్ట్రంలో మళ్లీ గుడుంబా గుప్పుమనడానికి చాలా కారణాలున్నాయి. మద్యం అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం కాగా, లాక్‌డౌన్ సమయలో పనుల్లేకపోవడం మరో కారణమని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. గుడుంబాను నిర్మూలించగలిగాం కానీ గుడుంబా కాసే పద్ధతులు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మర్చిపోలేదని వారు చెబుతున్నారు. చాలాకాలంగా గుడుంబాపై ఆధారపడి జీవించిన వర్గాలు మళ్లీ అటువైపు ఆకర్షితులయ్యేలా పరిస్థితులు మారాయని అంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో రాత్రిపూట పూర్తిగా కర్ఫ్యూ ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా కాస్తున్నారని చెబుతున్నారు. వీటన్నిటికితోడు నిత్యావసర వస్తువుల్లో భాగంగా బెల్లం, పటిక, పండ్లు అందుబాటులో ఉండడం కూడా గుడుంబా తయారీదారులకు కలిసివస్తోంది.
అక్కడ పేట్రేగితే అంతే సంగతులు
రాష్ట్రంలో చాలాకాలంగా గుడుంబాకు ఆలవాలమైన ప్రాంతాలున్నాయి. వీటిని ఎక్సైజ్ శాఖ హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. హైదరాబాద్‌లోని ధూల్‌పేట సహా దేవరకొండ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, గద్వాల, అచ్చంపేట, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, జహీరాబాద్, వికారాబాద్, ఆమనగల్, షాద్‌నగర్, ఎల్లారెడ్డిపేట, ఆర్మూరు, భీంగల్, దోమకొండ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అక్కడ మళ్లీ గుడుంబా బట్టీలు రాజుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని ఆబ్కారీ అధికారులంటున్నారు. ఈ ప్రాంతాల్లో గుడుంబా వినియోగం పెరిగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుందని, మళ్లీ కోలుకోడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుం దోననే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది.
ఆ గుర్తింపు మాయం!
వాస్తవానికి, లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణ గుడుంబారహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది. 2017లో గుడుంబాపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టిన ఎక్సైజ్ యంత్రాంగం ఏడాదిపాటు అహోరాత్రులు శ్రమించి 2018 నాటికి రాష్ట్రంలో గుడుంబా ఆనవాళ్లు లేకుండా చేసింది. ఏడాది పాటు ఆ శాఖ చేసిన కష్టమంతా ఈ 40 రోజుల్లో గుడుంబా బట్టీల పాలైంది. మద్యానికి అలవాటు పడ్డ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు మళ్లీ నాటుసారా బాట పట్టారని, మళ్లీ రాజుకున్న సారా బట్టీ మంటలను ఆర్పడం ఇప్పట్లో సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు.
బెల్లం నానబెట్టిన డ్రమ్ములు స్వాధీనం
లాక్‌డౌన్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూతపడగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో గుడుంబా తయారీ ఊపందుకుంది. అయితే, ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ముమ్మరం కావడంతో సమీపంలోని అటవీ ప్రాంతాలను ఎంచుకొని ఇలా డ్రమ్ముల్లో బెల్లాన్ని నానబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలో మంగళవారం అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ డ్రమ్ములు బయటపడ్డాయి. ఎక్సైజ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని పారబోశారు.
– ఖానాపురం
Comments
Please login to add a commentAdd a comment