గుంటూరు జిల్లా నందివెలుగు గ్రామం వైన్‌షాపు వద్ద బారులు తీరిన మందుబాబులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో భారీగా ధరలు పెంచిన ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు, కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ సోమవారం నుంచి విక్రయాలకు అనుమతించడంతో 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. చాలా రోజుల తరువాత దుకాణాలు తెరవడంతో తొలిరోజు మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల మధ్యాహ్నం 2 గంటలకు షాపులు తెరిచారు. మద్యం షాపుల సీల్ తెరిచేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉండటం, కంటైన్‌మెంట్ క్లస్టర్ల జాబితాలు అందకపోవడంతో కొంత ఆలస్యమైంది.
రెడ్‌జోన్లలో దుకాణాలు బంద్
► రాష్ట్రంలో మొత్తం 3,468 మద్యం షాపులుండగా కంటైన్మెంట్ క్లస్టర్లను మినహాయించి మిగిలిన చోట్ల 2,345 దుకాణాలు తెరిచారు. మద్యం షాపులను రెడ్‌జోన్‌లో కూడా తెరవవచ్చని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో వీటిని తెరవలేదు.
► విజయవాడతోపాటు ప్రకాశం జిల్లాలో ఒక్క మద్యం షాపు కూడా తెరవలేదు. ప్రకాశం జిల్లాలోని మద్యం గోడౌన్లు కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఉండటంతో ఎక్సైజ్ శాఖ షాపులను తెరవలేదు. విజయవాడలో కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితా అందకపోవడం వల్ల తెరవలేదు.
► గత 45 రోజుల నుంచి రాష్ట్రంలో మద్యం దొరకపోవడంతో సోమవారం మద్యం ప్రియులు ఒక్కసారిగా షాపుల వద్దకు చేరుకున్నారు. మద్యం దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలలో నిలుచుని తమ వంతు కోసం నిరీక్షించారు. అయితే కొన్నిచోట్ల భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు.
► మద్యం ధరలు పెంచినా కొన్ని దుకాణాల్లో మధ్యాహ్నానికల్లా సరుకు ఖాళీ అయింది. మద్యం షాపుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, వలంటీర్లు విధులు నిర్వహించారు. ఎక్కువ చోట్ల భౌతిక దూరం పాటించినప్పటికీ కొన్నిచోట్ల మొదటిరోజు కావడం మూలాన మాత్రం ఉల్లంఘనలు జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా కవిటి సినిమా హాలు రోడ్డులో మద్యం దుకాణం వద్ద క్యూ లైన్
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం కోసం..
► కొందరు తమిళనాడు వాసులు ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో షాపుల్ని మూసివేసి వారిని వెనక్కి పంపించారు. నెల్లూరు జిల్లా జీవీ పాలెం, రామాపురం, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం దుకాణాల వద్దకు పొరుగు రాష్ట్రం నుంచి ప్రజలు రావడంతో అమ్మకాలు నిలిపివేశారు.
► ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో కూడా మద్యం దుకాణాల వద్దకు భద్రాచలం వాసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో షాపులను మూసివేశారు.
► గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని మాచవరం, పిల్లుట్ల ప్రాంతాల్లో మద్యం అమ్మకాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రాంతం వారు మరో ప్రాంతానికి రావడంతో ఘర్షణ నెలకొంది.
భారీగా పెరిగిన మద్యం ధరలు
అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద మద్యం ధరలను భారీగా పెంచారు. మద్యపానాన్ని నీరుగార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment