సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభ పరిస్థితుల తర్వాత మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలోని 1,172 బార్లకు ఆర్థిక ఆసరా కలిగేలా ఎక్సైజ్ శాఖ నిబంధనలను సవరించింది. లైసెన్సింగ్ విధానాన్ని సరళతరం చేయడంతోపాటు బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ ఫీజు చెల్లింపులో ఉదారత, కమీషన్ పెంపు లాంటి చర్యల ద్వారా ఆర్థికంగా బార్లను కుదుటపడేలా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పులతో కూడిన ఉత్తర్వులు నేడో, రేపో రానున్నాయి.
ఆ బాటిళ్లు ఇస్తే ఎలా?
ఇప్పటివరకు వైన్ షాపుల్లోనే క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంపై వైన్‌షాప్ యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్వార్టర్, హాఫ్ బాటిళ్లు బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మితే తమ అమ్మకాలు కుంటుపడతాయని వారు చెబుతున్నారు.
అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం ఇప్పటికే 2బీ (బార్ అండ్ రెస్టారెంట్) లైసెన్సుల కింద స్టార్ హోటళ్లలో క్వార్టర్లు, హాఫ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు సాధారణ బార్ అండ్ రెస్టారెంట్లకూ దీన్ని వర్తింపజేస్తున్నామని చెబుతోంది. ఇలా చేయడం ద్వారా వినియోగదారుడికి తాను తీసుకొనే మద్యం బ్రాండ్లపై నమ్మకం ఉంటుందని, స్టాక్ సమస్య రాదని, తయారీదారుడికి సైతం వెసులుబాటు ఉంటుందని అంటోంది.
ఇప్పటివరకు ఉన్న నిబంధనలు
► క్వార్టర్, హాఫ్ బాటిళ్లు ఉండేవి కావు. ఫుల్‌బాటిళ్ల ద్వారానే విక్రయాలు.
► మూడు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లింపునకు అవకాశం.
► బ్యాంకు గ్యారెంటీ కింద సగం లైసెన్స్ ఫీజు చూపాలి.
► లైసెన్స్ ఫీజుతో పోలిస్తే ఐదు రెట్ల విలువైన మద్యం అమ్మే వరకు బార్ యజమానులకు 20% కమీషన్. ఆ తర్వాత అమ్మే మద్యం విలువలో 13.6% ప్రభుత్వానికి, 6.4% బార్ యజమానులకు కమీషన్.
► ఏటా అన్ని డాక్యుమెంట్లూ సమర్పిస్తేనే లైసెన్స్ రెన్యూవల్.
నిబంధనల్లో రానున్న మార్పులు
► బార్లలోనూ క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులోకి.
► లైసెన్స్ ఫీజు 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు.
► 25% లైసెన్స్ ఫీజును బ్యాంక్ గ్యారెంటీగా చూపితే సరిపోనుంది.
► లైసెన్స్ ఫీజు కంటే ఏడు రెట్లు మద్యం విక్రయాల వరకు 20 శాతం కమీషన్. ప్రభుత్వానికి 10 శాతం , మరో 10 శాతం బార్ యజమానులకు కమీషన్.
► రెస్టారెంట్ లైసెన్స్ చూపించి ఫీజు కడితే లైసెన్స్ ఆటో రెన్యూవల్.
చదవండి: రెండ్రోజులపాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌లో భగభగ
Comments
Please login to add a commentAdd a comment