
సాక్షి, ములుగు : లాక్‌డౌన్ ముసుగులో కొందరు ఎక్సైజ్ అధికారులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మహిళా ఎస్‌ఐ భారతి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్సైజ్ ఎస్‌ఐ భారతి... వెంకటేశ్ అనే వ్యక్తి మద్యం బాటిళ్లు దొంగ చాటుగా సరఫరా చేస్తున్నాడని సమాచారం అందడంతో అతని ఇంటికి చేరుకొని నానా బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో వెంకటేశ్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి తాళాలు పగులుగొట్టి వస్తువులన్ని చిందరవందరగా పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే ఇంటికి చేరుకున్న బాధితుడు కక్ష సాధింపు చర్యలతోనే తన ఇంటిపై దాడి చేశారంటూ భారతిపై ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ములుగు పోలీసులు ఎస్‌ఐ భారతిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.