దుర్గాబార్ వద్ద యథేచ్ఛగా బయటకు (పార్శిల్) మద్యాన్ని విక్రయిస్తున్న దృశ్యం
తాడిపత్రి అర్బన్: తాడిపత్రిలో పొద్దు పొద్దున్నే పాల ప్యాకెట్లయినా సరిగా దొరుకుతాయో లేదో కానీ మద్యం మాత్రం అన్ని వేళలా దొరుకుతోంది. సమయం ఏదైనా సరే తలుపు తట్టడమే ఆలస్యం అడిగిన మొత్తం చెల్లిస్తే ఏ బ్రాండ్ మద్యం కావాలన్నా చేతికందిస్తారు. సామాన్యుల వ్యసనాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేస్తూ తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకోవడమే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
నిబంధనలకు తూట్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు మద్యం దుకాణాలకు పూర్తి ఎత్తివేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే అది కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల మధ్యలోనే మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. బార్ల సమయాలను కూడా కుదించేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యం బాటిళ్లను పార్శిల్ విధానం ద్వారా బయటకు ఇవ్వకూడదు. అయితే తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగినంత ఇస్తే చాలు మద్యం ఎప్పుడు కావాలన్నా సరే ఇచ్చేస్తున్నారు.
కార్మికులే లక్ష్యంగా....
తాడిపత్రి చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థల్లో పనిచేసే కారి్మకులు కూడా అధికంగానే ఉంటారు. ముఖ్యంగా కారి్మకులనే లక్ష్యంగా చేసుకొని బార్ల నిర్వాహకులు తమ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవని సమయాల్లో ఒక్కో క్వాటర్ బాటిల్ పై రూ.50 నుంచి రూ.70 దాకా అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మామూళ్ల మత్తుల్లో ఎక్సైజ్ అధికారులు
తాడిపత్రిలోని అన్ని బార్లలో ఎప్పుడు కావాలన్నా మద్యం సిద్ధంగా ఉంటుంది. ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నా ఎక్సైజ్ పోలీసులతో పాటు పట్టణ పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నారు. పత్రికల్లోనో, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బార్ల నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తుండటంతోనే పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలున్నాయి.
కొత్తగా వచ్చా...
బార్ నిర్వాహకుల దందాపై ఎక్సైజ్ ఎస్‌ఐ స్వామినాథన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ ఈ సర్కిల్‌కి కొత్తగా వచ్చా... మీకు వివరణ కావాలంటే సీఐని అడగండి’ అని సమాధానమిచ్చారు. తాడిపత్రి సర్కిల్ ఎక్సైజ్ సీఐని ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment