సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో నవంబర్‌లో జరగాల్సిన వైన్‌షాపుల లాటరీ ప్రక్రియ వచ్చే నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అక్టోబర్‌లోనే వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. 2021–23 సంవత్సరాల ఏ4 (వైన్స్) షాపుల లైసెన్సు కాలం ముగియక ముందే 2023–25 సంవత్సరాలకు లైసెన్సులిచ్చే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మరంగా ముందుకెళ్తోంది. వచ్చే నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ప్రారంభం కల్లా ప్రక్రియను పూర్తి చేసేలా కొత్త పాలసీ రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
ముందుగానే ఎందుకు?:
వాస్తవానికి, 2021–23 (రెండేళ్ల పాలసీ) సంవత్సరాలకుగాను ఏ4 లైసెన్సుల గడువు వచ్చే నవంబర్ 30తో ముగియనుంది. అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్‌దారులు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అలా జరగాలంటే అక్టోబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రానున్న రెండేళ్లకు (2023–25) లైసెన్సులను లాటరీ పద్ధతిలో జారీ చేసేందుకు కొత్త పాలసీ రూపొందించాల్సి ఉంటుంది. అయితే, వచ్చే డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది.
దీంతో ఎన్నికల నియమావళి వచ్చేలోపే నోటిఫికేషన్ ఇచ్చి లాటరీలు ముగించి కొత్త లైసెన్స్‌దారులకు షాపులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రమే వారికి షాపులు అప్పగించాలని, ఈలోగా పాత లైసెన్స్‌ల ద్వారా మద్యం విక్రయాలు జరపవచ్చని అంటు న్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన మద్యం టెండర్లకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు.
అడిగితే ఇవ్వరా?:
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ముందస్తు ఎక్సైజ్ టెండర్లకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. గతంలో జూలై 1 నాటికి లైసెన్సులు ముగిసేవి. కానీ, 2014లో మూడుసార్లు గడువు పెంచడంతో ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఈసారి గడువు పెంచకుండా ముందస్తుగా లాటరీల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డంకి అయితే, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ప్రక్రియ ప్రారంభించి లైసెన్స్‌లను ఖరారు చేసి పెట్టుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కోడ్ అయ్యాక కొత్త లైసెన్స్‌దారులకు షాపులు అప్పగించవచ్చనే వాదనా ఉంది. అయితే, అప్పటివరకు ఎంతకాలం అవసరమైతే అంతకాలం పాటు గడువు పొడిగించి పాత లైసెన్స్‌దారుల దగ్గరే ఫీజు వసూలు చేసి విక్రయాలు జరపవచ్చనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు, వైన్‌షాపుల్లో కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మళ్లీ ఇప్పుడు ముందస్తు ప్రక్రియపై ఎవరైనా కోర్టుకు వెళితే అసలుకే ఎసరు వస్తుందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లోనే జరుగుతుండటం గమనార్హం.
ఆదాయం కోసమేనా?:
మందుషాపులకు ముందస్తు లాటరీలు ఆదాయం కోసమేనా అనే చర్చ జరుగుతోంది. రెండేళ్లకు లైసెన్సు ఫీజు జారీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల అమ్మకాల మీదనే ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం లాటరీ ప్రక్రియ పూర్తయి షాపు కేటాయించాలంటే మొదటి విడత లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ ఫీజు కింద మరో రూ.500– 600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎన్నికలకు ముందు ఈ రూ.2 వేల కోట్ల కోసమే ఎక్సైజ్ శాఖ హడావుడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment