ఎవరినీ వదలం..
►ఏదైనా గ్రామంలో ఐదుసార్లకు మించి గంజాయి దొరికితే.. ఆ ఊరికి రైతు బంధుతో సహా అన్నిరకాల సబ్సిడీలను రద్దు చేస్తాం.
►గంజాయి, డ్రగ్స్ కేసుల్లో త్వరగా బెయిల్ రాకుండా చర్యలు. అవసరమైతే పీడీ యాక్ట్.
►డ్రగ్స్ మాఫియాను నిర్మూలించే క్రమంలో పోలీసులకు అధునాతన ఆయుధాలు
►మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి డీఅడిక్షన్ చికిత్స ఇప్పించడం, డ్రగ్స్ నెట్‌వర్క్ లింకులను గుర్తించి నిర్మూలించడంపై దృష్టి
►మాదక ద్రవ్యాల నియంత్రణకు గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేకంగా 1,000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు. మంచి పనితీరు చూపే పోలీసులకు యాక్సెలరేషన్ ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు.
►డ్రగ్స్ తయారీ, పంపిణీకి నెలవుగా మారుతున్న ఫార్మా కంపెనీలను గుర్తించి చర్యలు.
►డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా పోలీసులు ఉపేక్షించొద్దు. ఏ పార్టీ వారైనా సరే వదలొద్దు.
►డ్రగ్స్ నియంత్రణపై జనంలో అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సదస్సులు నిర్వహించాలి.
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం? మన పిల్లలు మన కళ్ల ముందే డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకాన్ని సమూలంగా మొగ్గలోనే తుంచేయాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఏ పార్టీవారైనా, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
యువత డ్రగ్స్‌వైపు మళ్లకుండా అవగాహన కల్పించాలని.. ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్నవారిని గుర్తించి కటకటాల్లోకి నెట్టాలని అధికారులను ఆదేశించారు. ‘తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్’ను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై శుక్రవారం ప్రగతిభవన్‌లో పోలీసు, ఎక్సైజ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
గ్రామాల్లో స్థానికులే దృష్టిపెట్టాలి
‘‘గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్తుల మీద కూడా ఉంది. ఏదైనా గ్రామంలో ఐదుసార్లకు మించి గంజాయి దొరికితే.. ఆ ఊరికి రైతు బంధుతో సహా అన్నిరకాల సబ్సిడీలను రద్దు చేస్తాం. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల విషయంగా గ్రామస్తులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించాలి. ‘డ్రగ్స్ ఫ్రీ’గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్‌తోపాటు ఇన్సెంటివ్స్ ఇస్తాం. డ్రగ్స్ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మీడియా, సినీ మాధ్యమాలను వినియోగించుకోవాలి. డ్రగ్స్ నియంత్రణపై అవగాహన పెంచే సినిమాలు, డాక్యుమెంటరీలు, ప్రకటనలకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాలి.
పీడీ యాక్ట్‌లు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌లు..
వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం చేస్తున్న విధంగా.. డ్రగ్స్, గంజాయి దందా చేసేవారిపైనా పీడీ యాక్ట్‌లు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. నేరస్తులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన ‘ఫోరెన్సిక్ ల్యాబ్స్’ను ఆధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేయాలి. నిందితులను కోర్టుల ముందు ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
డ్రగ్స్ కేసుల్లో బెయిల్ త్వరగా వచ్చే పరిస్థితులు ఉన్నందున.. వ్యసనపరులు, వ్యాపారులు తిరిగి దందా కొనసాగిస్తున్నారు. ఇలా జరగకుండా తగిన న్యాయ సలహాలు తీసుకుని చర్యలు చేపట్టాలి. ఇక నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యవస్థీకత నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అలాంటి వారిని వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించేయాలి. సోషల్ మీడియా ద్వారా కూడా డ్రగ్స్ దందా నడుస్తుందనే విషయం పరిశీలనలో తేలింది. దాని మీద కూడా దృష్టి సారించాలి.
ద్విముఖ వ్యూహంతో..
►డ్రగ్స్‌ను నియంత్రించేందుకు అధికారులు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. మొదట ఇప్పటికే డ్రగ్స్‌కు బానిసైన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో డీఅడిక్షన్ చికిత్స ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించాలి. డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం, వారికి డ్రగ్స్ అందిస్తున్న నెట్‌వర్క్ లింకులను గుర్తించి నిర్మూలించడమనేది రెండో కార్యాచరణగా చేపట్టాలి. డ్రగ్స్ మాఫియా ను అరికట్టే క్రమంలో పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలి. చురకల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలి.
►ఇంటర్, డిగ్రీ, వృత్తివిద్య కాలేజీలు, విద్యా సంస్థల యాజమాన్యాలను, ప్రిన్సిపాల్స్‌ను పలిచి సమావేశాలు నిర్వహించాలి. డ్రగ్స్ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ఉండేలా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి.
►డ్రగ్స్ నియంత్రణపై జనంలో అవగాహన కల్పించేందుకు గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులతో సమావేశాలు, సదస్సులు నిర్వహించాలి.
మూలాలను గుర్తించాలి..
మూసివేసిన ఫార్మా పరిశ్రమల వంటివి డ్రగ్స్ తయారీ, పంపిణీకి నెలవుగా మారుతున్నాయన్న సమాచారం వస్తోంది. అలాంటి వాటిని తక్షణమే గుర్తించి చర్యలు చేపట్టాలి. ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల్లోంచి గంజాయి అక్రమ రవాణాను రూపుమాపాలి. పోలీస్, ఎక్సైజ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. అక్రమ మద్యం, గుడుంబా, పేకాట నియంత్రణపైనా గట్టిగా దృష్టి సారించాలి.
పబ్బులు, బార్లపై ప్రత్యేకంగా నజర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి, ఇతర డ్రగ్స్ వినియోగం మూలాలను గుర్తించి నియంత్రించాలి. రాష్ట్రంలో హుక్కా సెంటర్లనే మాటే వినపడకూడదు. పబ్బులు, బార్లు వంటిచోట్ల డ్రగ్స్ వినియోగంపై దృష్టి సాధించాలి. డీకామ్ ఆపరేషన్లు చేపట్టి.. దందాను గుర్తించి, లైసెన్సులు రద్దు చేయాలి. ఈ మేరకు వాటి యజమానులను పిలిపించి, కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి.’’
ఎవరైనా సరే.. వదిలేది లేదు..
►డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే వదలొద్దు. నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తే.. నిర్ద్వందంగా తిరస్కరించాలి.
►పోలీసులుగానీ, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గానీ డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. తరచుగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు.
►నార్కోటిక్ కేసుల విచారణలో ప్రభుత్వ అడ్వొకేట్లు కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. డ్రగ్స్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించాలి.
గ్రేహౌండ్స్ మాదిరిగా.. ప్రత్యేక సెల్
రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, స్మగ్లింగ్‌ను మొగ్గలోనే తుంచేందుకు..ఆధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా 1,000 మందిని నియమించుకోవాలి. ఆపరేషన్స్ యూనిట్‌లో అసాంఘిక శక్తులను నిర్వీర్యం చేస్తున్న గ్రేహౌండ్స్ మాదిరిగా.. నార్కోటిక్ డ్రగ్స్‌ను నియంత్రించే విభాగం కూడా పనిచేయాలి. అద్భుత పనితీరు చూపే అధికారులు, సిబ్బందికి రివార్డులు, ఇతర ప్రోత్సాహకాలను అందించాలి. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. యూకేలో స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు, పంజాబ్‌వంటి చోట్ల డ్రగ్స్ నియంత్రణ, నేరస్తులను గుర్తించి పట్టుకోవడం కోసం అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి.. మనదగ్గరా అమలు చేయాలి.
అధికారులు ఆయా చోట్ల పర్యటించి రావాలి. ఈ సమీక్షలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కవితా నాయక్, ఎమ్మె ల్యేలు బాల్క సుమన్, రెడ్యానాయక్, రవీంద్రకుమార్ నాయక్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, గ్యాదరి కిశోర్, సాయన్న, రేఖానాయక్, అబ్రహం, హన్మంత్ షిండే, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment