‘సిట్టింగులందరికీ సీట్లు’ | Cm Kcr Meeting In Telangana Bhavan Hyderabad | Sakshi
Sakshi News home page

‘సిట్టింగులందరికీ సీట్లు’

Published Sun, Sep 4 2022 5:18 AM | Last Updated on Sun, Sep 4 2022 5:18 AM

Cm Kcr Meeting In Telangana Bhavan Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలనేది నా విధానం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం ఖాయమే అయినా కొందరు పనితీరు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 72 నుంచి 80 స్థానాలు మనమే గెలుస్తాం. కొద్దిగా కష్టపడితే 90 నుంచి 100 సీట్లు సాధించడం ఖాయం. కేడర్‌తో పొరపచ్ఛాలు రాకుండా వారితో కలసి వన భోజనాలు చేయండి. దళితబంధు, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లండి. మనం చేసిన కార్యక్రమాలను ప్రజలకు విడమరిచి చెప్పకపోవడంతో అయోమయం ఏర్పడుతోంది.

ఇకపై హైదరాబాద్‌ను ఖాళీ చేసి నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం పార్టీ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగించారు. ప్రగతి భవన్‌లో మంత్రివర్గ భేటీ అనంతరం నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌... సుమారు 2 గంటలపాటు రాష్ట్ర, జాతీయ రాజకీయాలతోపాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

డిసెంబర్‌లోగా ‘డబుల్‌’ లబ్ధిదారులను ఎంపిక చేయండి..
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలను సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. నియోజకవర్గాలవారీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యేలకు ఆయన అందజేశారు. ‘నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులను దళితబంధు పథకం కింద వెంటనే ఎంపిక చేయాలి. లబ్ధిదారులకు ఇచ్చేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయి. సొంత జాగాలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా నియోజకవర్గానికి 3 వేల మంది లబ్ధిదారులను డిసెంబర్‌లోగా ఎంపిక చేయాలి’అని కేసీఆర్‌ ఆదేశించారు.

అన్ని రంగాల్లోనూ బీజేపీ ఫెయిల్‌...
‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశానికేం చేశామో చెప్పుకునేందుకు అంశాలేవీ లేనందునే కేవలం మత చాందసవాదాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి భాగస్వామ్య పార్టీలు దూరమై ఏకాకిగా మారింది. అన్ని రంగాల్లోనూ బీజేపీ విఫలమైన తీరును ప్రజలు గమనిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి.

తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ సహా అమిత్‌ షా, నడ్డా వంటి బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు టీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తిపోయడం మినహా రాష్ట్రానికి చేసేదేంటో చెప్పడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వంటి వారు రాష్ట్రానికి వచ్చి ప్రధాని ఫొటో లేదంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతకు మించి చెప్పేందుకు బీజేపీ వద్ద ఏమీ ఉండదు. బీజేపీ మత పిచ్చి రాజకీయాలపట్ల తొలుత రాష్ట్రంలో కొంత ఆసక్తి వ్యక్తమైనా ఇప్పుడా పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

మీలో కొందరికి కేంద్ర బెర్త్‌లు..
‘మనం జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం ఖాయం. టీఆర్‌ఎస్‌ ఏర్పాటు సమయంలోనూ మీలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వస్తారని చెబితే ఎవరూ నమ్మలేదు. మనం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మీలో చాలా మందికి రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు, గవర్నర్లు, విదేశీ రాయబారులుగా అవకాశం లభిస్తుంది’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

మునుగోడులో బీజేపీకి డిపాజిట్‌ దక్కదు
‘మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ 200 శాతం విజయం సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉండటంతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్‌ దక్కే పరిస్థితి కూడా లేదు. అన్ని సర్వేల్లోనూ మనం 42 శాతానికిపైగా ఓట్లు సాధిస్తామని ఫలితాలు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో రెండు గ్రామాలకు ఒక్కో ఎమ్మెల్యేకు చొప్పున బాధ్యతలు అప్పగిస్తాం. త్వరలో గ్రామాలవారీగా ఇన్‌చార్జి ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తాం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి చెందిన 15 మంది సుశిక్షుతులైన కార్యకర్తల బృందంతో వెళ్లి ఆయా గ్రామాల్లో స్థానిక కేడర్‌తో మమేకమై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలి. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ముగిశాక మునుగోడు ప్రచారానికి ఎమ్మెల్యేలు వెళ్లాలి’అని కేసీఆర్‌ ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో...
ఈ నెల 6, 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. 6న దివంగత సభ్యులకు నివాళి అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయని చెప్పారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో ఎజెండా ఖరారవుతుందన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలను స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో నిర్వహించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

త్వరలో జాతీయ స్థాయి దళిత సదస్సు
ఇటీవల నిర్వహించిన జాతీయ రైతు సంఘాల భేటీలో తెలంగాణ ప్రభుత్వ విధానాలపట్ల మంచి స్పందన లభించింది. దళితబంధు పథకం తీరుతెన్నులను చూసి యూపీకి చెందిన ఓ రైతు సంఘం ప్రతినిధి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాంటి అద్భుతమైన పథకం దేశమంతా అమలు కావాలంటే నన్ను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. రైతు సంఘాల నేతల భేటీ తరహాలో త్వరలో జాతీయ స్థాయిలో దళిత సంఘాల ప్రతినిధులతోనూ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి’అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. 

సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడంలో సఫలమైన బీజేపీకి.. బిహార్, ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో మిమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు జరుగుతాయి. మనం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నిఖార్సుగా పనిచేస్తున్నాం. అందువల్ల కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడాల్సిన పనిలేదు.    – సీఎం కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement