సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్)’తో టీఆర్‌ఎస్ కలిసి పనిచేయడం ఖాయమైంది. ఐప్యాక్ సేవలు పొందేందుకు అవసరమైన అంశాలపై లోతుగా చర్చించిన టీఆర్‌ఎస్ పెద్దలు, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్.. ఒప్పందంపై ఆదివారం సంతకాలు చేశాయి. రెండేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ త్వరలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఈ నేపథ్యంలో పీకే టీమ్ ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై కేసీఆర్, పీకే మధ్య లోతుగా చర్చ జరిగినట్టు తెలిసింది.
రెండు రోజులుగా..
శనివారం ఉదయమే ప్రగతిభవన్‌కు చేరుకున్న ప్రశాంత్ కిషోర్.. ఆ రోజంతా కేసీఆర్‌తో చర్చించారు. రాత్రికి ప్రగతిభవన్‌లోనే బస చేశారు. ఆదివారం ఉదయం నుంచీ తిరిగి చర్చలు జరిగాయి. ఇందులో కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరినా ఐప్యాక్ బృందం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌కు అవసరమైన సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఐప్యాక్‌కు దూరంగా ఉంటారని తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతకు ముందు సీఎం కేసీఆర్ కూడా.. పీకే తనకు ఏడెనిమిదేళ్లుగా మిత్రుడని, ఆయన డబ్బు తీసుకుని పనిచేయరని, దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి అని కితాబునిచ్చారు కూడా.
వ్యవస్థాపక దినోత్సవం నుంచి మొదలు
ప్రగతిభవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన విధానాలు, సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై చర్చించారు. ప్రధానంగా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్, పీకే చర్చించినట్టు తెలిసింది. గతంలో ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో రెండు రోజుల పాటు బసచేసిన ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ నుంచి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఇన్‌పుట్స్ తీసుకున్నారు. తర్వాత రాష్ట్ర రాజకీయాలు, నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ బలం, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు తదితరాలను ఐప్యాక్ మదింపు చేసి నివేదిక రూపొందించింది. ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, ప్రతిపాదనలను ఈనెల 27న జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి అమలుచేసే దిశగా కార్యాచరణ ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రగతిభవన్‌లో చర్చలు ముగిశాక ఆదివారం సాయంత్రం పీకే ఢిల్లీకి బయలుదేరగా.. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
పార్టీ నుంచి వివరణ లేదు పీకే అంశంపై పార్టీ నుంచి మాకు ఏ వివరణ అందలేదు. ఊహాగానాలపై చర్చ అవసరం లేదు. మీడియా కథనాలపై స్పందించలేం. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాం.
– విలేకరులతో ఉత్తమ్, భట్టి
మా పరిధిలోకి రాదు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అంశం మా పరిధిలోకి రాదు. కానీ కాంగ్రెస్‌లో చేరతానని చెప్పిన పీకే.. టీఆర్‌ఎస్ నేతలతో కలవడం వల్ల సహజంగానే కొన్ని అనుమానాలు వస్తాయి. పీకే విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అందులో గందరగోళం లేదు.
– జగ్గారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment