సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.18 లక్షల కోట్ల మేర నిధులు సమకూరాయి. వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 87,207.22 కోట్లుకాగా బహిరంగ మార్కెట్‌లో రూ. 31,333.72 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది. 2023–24 బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడులు రూ. 2.59 లక్షల కోట్లుకాగా అందులో 46 శాతం మేర అర్ధ వార్షిక కాలంలో వచ్చాయి.
ఇందులో పన్ను ఆదాయం రూ. 66,691.49 కోట్లు ఉండగా పన్నేతర ఆదాయం రూ. 16,896.29 కోట్లు వచ్చినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల నివేదికలో వెల్లడించింది.
ఖర్చు రూ. 1.14 లక్షల కోట్లు
తొలి ఆరు నెలల కాలంలో రూ. 1,18,558.96 కోట్ల మేర రాబడులురాగా అందులో రూ. 1,14,151.39 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ. 91,315.21 కోట్లుగా నమోదవగా ప్రణాళికా వ్యయం కింద రూ. 22,836.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం వ్యయ అంచనాల్లో ఆరు నెలల కాలంలో జరిగిన ఖర్చు 61 శాతం కావడం గమనార్హం.
ఇక సమకూరిన పన్ను ఆదాయాన్ని శాతాలవారీగా పరిశీలిస్తే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనా రూ. 19,884 కోట్లుకాగా అందులో 62 శాతం అంటే రూ. 12,255.95 కోట్లు మొదటి ఆరునెలల్లోనే వచ్చింది. రానున్న ఆరు నెలల కాలంలో కలిపి అంచనాలను మించి ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment