సాక్షి హైదరాబాద్: ఆబ్కారీశాఖలో నకిలీ ఈవెంట్ పర్మిట్ల దందా చర్చనీయాంశంగా మారింది. వేడుకల సందర్భంగా మద్యం వినియోగానికి నకిలీ అనుమతులు ఇచ్చిన ఉదంతంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, బాంక్విట్ హాళ్లు వంటి చోట్ల నిర్వహించే వేడుకల సందర్భంగా మద్యం వినియోగం కోసం పెద్ద సంఖ్యలో నకిలీ అనుమతులను ఇచ్చినట్లు వెల్లడి కావడంతో ఎక్సైజ్ శాఖ సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
ఈ ఉదంతం వెనుక పైఅధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సీఐలతో పాటు మరో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అనుమతితోనే నకిలీ దందా కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఖాతాలో చేరాల్సిన సొమ్మును స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా కేవలం సస్పెన్షన్‌కే పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌తో పాటు నగర శివార్లలోని మరికొన్ని స్టేషన్‌ల పరిధిలోనూ ఇలాంటి నకిలీ పర్మిట్లు వందల సంఖ్యలో వెలువడ్డాయని, ఉన్నతస్థాయిలో విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఎక్సైజ్ శాఖలో ఏళ్లుగా..
- మరోవైపు తాజాగా నకిలీ అనుమతుల ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ 2016 అక్టోబర్ నుంచి ఇలాంటి అనుమతుల దందా కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వేడుకలు జరుగుతాయి.
- అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తా రు. ఇలాంటి కార్యక్రమాలకు ఒకరోజు అనుమతికి రూ.8000 నుంచి రూ.9000 వరకు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు రూ.30 వేలకుపైగా ఎక్సైజ్‌శాఖకు చలానాల రూపంలో చెల్లించి ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
- పైఅధికారుల అండతోనే కిందిస్థాయి సిబ్బంది అనుమతుల సమూనాపత్రాల్లో తేదీలు, వేడుక స్థలాలను మార్పు చేసి ఇస్తున్నారు. ఇలా ఏటా వందల సంఖ్యలో నకిలీ అనుమతులు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ఆదాయం కొందరు అధికారులు, సిబ్బంది జేబుల్లోకొ వెళ్తోంది. మరోవైపు ఈ తరహా అక్రమాలకు పాల్పడే సిబ్బంది ఎలాంటి బదిలీలు లేకుండా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయి పని చేయడం గమనార్హం.
ఏసీబీతో విచారణ జరిపించాలి..
ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో నకిలీ అనుమతులపై ఉద్యోగుల సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు పరిమితం కాకుండా ఏసీబీ విచారణ జరిపించాలని, ఏ స్థాయి అధికారులైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ వర్గాలు కోరుతున్నాయి.
(చదవండి: పడవతో గస్తీ.. లేక్ పోలీసింగ్ వ్యవస్థ)
Comments
Please login to add a commentAdd a comment