
విశాఖ లీగల్: అనుమతి లేకుండా ప్రభుత్వ మద్యాన్ని అక్రమంగా విక్రయించిన మహిళకు ఆరు నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నగరంలోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీకాంత్ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నూతన ఎక్సైజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కనీసం 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోనే తొలి తీర్పు కావడం విశేషం. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవతారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక పెదగంట్యాడ పితానివానిపాలెంకి చెందిన పితాని సన్యాసమ్మ (50) 2020 ఆగస్టు 18న పెదగంట్యాడ సమీపంలోని ఆటోనగర్‌లో 12 మద్యం సీసాలు విక్రయిస్తూ ఉండగా న్యూపోర్టు పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా
తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment