illegal liquor case
-
HYD: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్‌లు, శివారుల్లోని ఫామ్‌హౌజ్‌లపై పోలీసులు శనివారం రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒకవైపు.. మాదాపూర్‌లోని పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బర్డ్ బక్స్, హాట్కప్ పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. మొయినాబాద్ పరిధిలోని ఫామ్హౌజ్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ ఫామ్‌హౌజ్, ముషీరుద్దిన్, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్‌లపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ మూడు ఫామ్ హౌజ్‌లపై కేసులకు గానూ పదిహేను మంది అరెస్ట్ చేశారు పోలీసులు. -
అక్రమ మద్యం కేసులో మహిళకు 6 నెలల జైలు
విశాఖ లీగల్: అనుమతి లేకుండా ప్రభుత్వ మద్యాన్ని అక్రమంగా విక్రయించిన మహిళకు ఆరు నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నగరంలోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీకాంత్ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నూతన ఎక్సైజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కనీసం 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోనే తొలి తీర్పు కావడం విశేషం. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవతారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక పెదగంట్యాడ పితానివానిపాలెంకి చెందిన పితాని సన్యాసమ్మ (50) 2020 ఆగస్టు 18న పెదగంట్యాడ సమీపంలోని ఆటోనగర్‌లో 12 మద్యం సీసాలు విక్రయిస్తూ ఉండగా న్యూపోర్టు పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన అధ్యాపకులు
సత్తెనపల్లి: అధ్యాపకులు సైతం తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తూ అధికారులకు దొరికిపోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) సీఐ ఈడె మారయ్యబాబు తెలిపిన వివరాలు.. సౌత్ సెంట్రల్ రైల్వే క్యాంటీన్ వర్కర్ రావూరి సాయికృష్ణ, పట్టణంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకుడు పొందుగల శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గంటా శ్రీనివాసరావు, వంట మాస్టార్ షేక్ వలీ ఒక బృందంగా ఏర్పడి నిత్యం రైల్లో తెలంగాణ మద్యం తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం సెబ్ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలు పెట్టుకుని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
అక్రమ మద్యం కేసులో ఏఎస్ఐ అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి: అక్రమ మద్యం కేసులో ఏఎస్ఐని అరెస్ట్ చేశారు. జీలుగుమిల్లి పీఎస్ పరిధి చెక్‌పోస్టు వద్ద నాలుగు రోజుల క్రితం రూ.20 లక్షలు విలువ చేసే అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. విచారణలో మద్యం అక్రమ రవాణాకు ఏఎస్ఐ సహా ముగ్గురు సహకరిస్తున్నట్లు గుర్తించామని పోలవరం డీఎస్పీ తెలిపారు. ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జీలుగుమిల్లి చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తూ.. మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఏఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రసాద్, కాగితాల రామారావు, రమేష్ లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : అక్రమ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్, మాచర్లలో ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్న టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్‌ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఇలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ వారు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండటంలేదని తెలిపారు.ఇదేమి అరాచకమని, ఇదేమి న్యాయమని అన్నారు. టీడీపీ వారికైతే ఒక న్యాయం, వైఎస్సార్ సీపీ నేతలకైతే మరో న్యాయమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక మనిషిలాగా మాట్లాడ్డంలేదని చెప్పారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే ఎవరో తరుముకొస్తున్నారనే భయం ఆయనలో కనిపిస్తోందని, ఆయన మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అసలు ఒక మహా పాతకం నుంచి పుట్టిన నాయకుడు ఉమామహేశ్వరరావు అని, ఆ పాతక భయం ఆయన్ని వెంటాడుతున్నందునే అలా అసహజంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీని మూసేస్తారని మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక పార్టీని స్థాపించిన వ్యక్తిని నిలువునా చంపి ఆ పార్టీని లాక్కున్న చరిత్ర టీడీపీ నేతలదని పద్మ చెప్పారు. అందుకే టీడీపీని పదేళ్లపాటు రాష్ట్ర ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వారు జగన్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదిరించి సీబీఐ కత్తిని గుండెలపై పెట్టినా బెదరకుండా వైఎస్ ఆశయాల సాధన కోసం పార్టీ పెట్టిన జగన్‌కు దానిని ఎలా కాపాడుకోవాలో తెలుసునని చెప్పారు. అసలు వైఎస్సార్ సీపీ అంటే అధికారంలో ఉన్న వారు ఎందుకంత భయంతో గంగవైలెత్తి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి చింతాకంత ప్రయోజనం కూడా లేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.