క్వార్టర్‌కు రూ.20, బీరుకు రూ.10 పెంచే యోచన
గత ఏడాది మేలో తగ్గించిన రూ.10తో పాటు మరో రూ.10 అదనంగా పెంచే అవకాశం
ఈ ఏడాది 6 నెలల్లో రూ.2500 కోట్ల లోటులో ఎక్సైజ్ శాఖ
లోటు పూడ్చుకునేందుకు ధరలు పెంచుతామని సీఎం వద్ద ప్రతిపాదన.. ఎలైట్ బార్ల స్థానంలో ఎలైట్ వైన్స్..రాష్ట్రవ్యాప్తంగా 20–25 షాపులిచ్చే చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచి పెరిగేది ఖరారు కాకపోయినా కచ్చితంగా మద్యం ధరలు పెంచాల్సిన పరిస్థితి ఎక్సైజ్ శాఖకు ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రాబడి తగ్గిపోవడం, గత ఏడాదిలో మద్యం ధరలు తగ్గించిన కారణంగా ఏర్పడిన లోటును ఇప్పుడు పూడ్చుకునే యోచనలో ఎక్సైజ్ యంత్రాంగం ఉంది. ఈ మేరకు మద్యం ధరల పెంపు ద్వారా రూ.2వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మద్యం ధరల పెంపుపై ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి క్వార్టర్ లిక్కర్‌కు రూ.20, బీరు సీసాపై రూ.10 పెంచేందుకు ఎక్సైజ్‌శాఖ సర్వం సిద్ధం చేసుకుంది.
గత ఏడాది రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయం
ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ఆలోచనతో గత ఏడాది ముందస్తుగానే వైన్‌షాపుల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. లైసెన్సు ఫీజులు, దరఖాస్తు రుసుం రూపేణా రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు రూ.2,500 కోట్లు లోటు చూపెడుతోందని, అమ్మకాల వారీగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే తగ్గలేదని ఎక్సైజ్ శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు గత ఏడాది మేలో ప్రతి క్వార్టర్ బాటిల్‌పై రూ.10 తగ్గించడంతో రూ.800 కోట్లు లోటు వచ్చిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మేలో తగ్గించిన రూ.10తో పాటు మరో రూ.10 పెంచితే రూ.1600 కోట్లు, బీర్ల రేటు రూ.10 పెంచడం ద్వారా రూ.300 కలిపి మొత్తం రూ.1900 కోట్ల వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావిస్తోంది. ఇటీవల సీఎం సమక్షంలో రాబడి శాఖలపై జరిగిన సమీక్షలో మద్యం ధరల పెంపు గురించి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్ ఇందుకు అంగీకరించలేదని, ఈ ప్రతిపాదనపై మరోమారు చర్చిద్దామని వాయిదా వేసినట్టు సమాచారం.
ఎలైట్ బార్లకు ‘నో’...
గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఎలైట్ బార్ల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సాధారణ బార్‌అండ్ రెస్టారెంట్లకు తోడు గత మూడు, నాలుగేళ్ల కాలంలో 89 ఎలైట్ బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లైసెన్స్ ఫీజు 10 శాతం అదనంగా ఉండే ఈ షాపుల కోసం మరో 50 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దరఖాస్తులన్నింటిని రద్దు చేయాలని, ఇప్పటివరకు అనుమతి వచ్చిన ఎలైట్ బార్లు మినహా భవిష్యత్‌లో అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో ఎలైట్ వైన్‌షాపుల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. నగరపాలికలతో పాటు కీలకమైన మున్సిపాలిటీల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 25 వరకు ఎలైట్ వైన్‌షాపులకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని, ఈ మేరకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఎలైట్ వైన్‌షాపులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఎక్సైజ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment