![Excise surveillance on elections - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/8/ts.jpg.webp?itok=k9jPCZ8O)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో అధికారులు ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర సరిహద్దుల వెంట వాహనాలను తనిఖీ చేసేందుకు 21 శాశ్వత ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో 8, మహారాష్ట్ర సరిహద్దులో 8, కర్ణాటక సరిహద్దులో 4, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.
ఈ చెక్‌పోస్టుల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. పోలీసులు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సమన్వయంతో 89 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, 4 సరిహద్దు మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 8 ఇన్‌కమింగ్ రైలు మార్గాల నుండి వచ్చే రైళ్లను తనిఖీ చేయడానికి 13 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అదుపులో 29,663 మంది
ఈనెల 5న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షా సమావేశం తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ఇప్పటివరకు రూ.1.14 కోట్ల విలువైన 14,227 లీటర్ల మద్యం, 1,710 కిలోల బెల్లం, 170 కిలోల గంజాయి, 21 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,663 మంది అనుమానాస్పద వ్యక్తులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 14 మందిపై పీడీ యాక్టు నమోదు చేశారు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న 8,362 మంది నిఘా పరిధిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment