ఇంటి దొంగల బాగోతం మొత్తం ఎక్సైజ్ శాఖ పరువును బజారున పడేస్తోంది. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. డబ్బు కిక్కు దిగని ఆ ఇద్దరు సీఐలు అడ్డదారిలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రముఖుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. లెక్కల్లో తేడా రాకుండా జాగ్రత్త పడుతూ ఎంచక్కా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మద్యం వ్యాపారం ఎక్సైజ్ శాఖలోని ఇద్దరు సీఐలకు ఆదాయ వనరుగా మారింది. గతంలో సిండికేట్, ఇతరత్రా మార్గాల్లో వస్తున్న ఆదాయానికి కాస్తా ప్రభుత్వం గండి కొట్టడంతో కొందరు ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. నేరుగా డిపో నుంచి కేసులకు కేసుల మద్యాన్ని తమకున్న విచక్షణాధికారాలతో తీసుకెళ్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న బ్రాండ్లను తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో కేసు మీద బ్రాండ్‌ను బట్టి రూ.10 వేల వరకు ఆర్జిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా మంచి బ్రాండ్లు కాస్తా పక్కదారి పడుతుండటంతో మద్యం దుకాణాల్లో ఈ బ్రాండ్ల మద్యం దొరకని పరిస్థితి నెలకొంది. అయితే, ఈ విధంగా పక్కదారి పట్టించిన మద్యాన్ని దుకాణాల్లోనే విక్రయించినట్టు లెక్కలు తారుమారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు ఎక్సైజ్ సీఐలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. వీరిద్దరూ తమకు తెలిసిన ముఖ్యుల పేర్లు చెప్పి ఈ విధంగా మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని సార్లు డిపోల నుంచి తరలిస్తుండగా.. మరికొన్ని సార్లు నేరుగా మద్యం దుకాణాల నుంచి తీసుకెళుతున్నారనేఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం తమకు తెలిసిన సూపర్‌వైజర్లను వాడుకుంటున్నారు. అయితే, స్థానిక ఎక్సైజ్ సీఐకి విషయం తెలిసి సూపర్‌వైజర్లను ప్రశ్నిస్తే.. సదరు ఇద్దరు సీఐల పేర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో వారితో తమకెందుకు గొడవంటూ స్థానిక ఎక్సైజ్ సీఐలు కిమ్మనకుండా ఉండిపోతున్నారని సమాచారం.
సూపర్‌వైజర్లతో లెక్క సరి
వాస్తవానికి గతంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఆయా దుకాణాల నుంచి నెలవారీగా మాముళ్లు వచ్చేవి. మరోవైపు బార్ల నుంచి కూడా భారీగానే దండుకునేవారు. అయితే, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలను ఎత్తేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాల నిర్వహణ సాగుతోంది. అంతేకాకుండా షాపుల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలోని కొందరు అక్రమార్కులకు గీతం లేకుండా పోయింది. దీంతో కొద్ది మంది అవినీతి సిబ్బంది కొత్త మార్గాలను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల్లో అవుట్‌సోర్సింగ్ కింద కొద్ది మంది సూపర్‌వైజర్లను తమకు తెలిసిన వారిని నియమించుకున్నట్టు సమాచారం. వీరి ద్వారా మద్యాన్ని పక్కదారి పట్టించి.. సదరు దుకాణంలోనే విక్రయించినట్టు లెక్కలు చూపుతున్నారు. ఈ విధంగా డిపో నుంచి నేరుగా తీసుకెళ్లిన మద్యం బాటిళ్ల లెక్కలను సరిచేసే బాధ్యతను కూడా తమకు అనుకూలమైన సూపర్‌వైజర్లతోనే చేయిస్తున్నారు. అంతేకాకుండా నేరుగా డిపో నుంచి కూడా వివిధ వ్యక్తుల పేర్లు చెప్పి కేసులకు కేసులు ఎత్తుకెళుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఇద్దరు సీఐల పాత్ర ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక సిబ్బందికి చుక్కలు
అక్రమ మద్యం, ఇసుక రవాణాను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)ను నియమించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని కూడా నియమించింది. సెబ్ పరిధిలోకి కొద్ది మంది ఎక్సైజ్ సిబ్బందిని కూడా తీసుకున్నారు. అయితే, ఈ విధంగా అక్రమాలు పాల్పడుతున్న సీఐల్లో ఒకరు సెబ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా తమకు అడ్డులేదనే రీతిలో వీరు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మద్యం దుకాణం నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకెళుతున్నట్టు తెలిసిన స్థానిక ఎక్సైజ్ సిబ్బంది పర్యవేక్షణకు వెళ్లి సూపర్‌వైజర్లను నిలదీస్తే.. సదరు అధికారి పేరు చెబుతున్నట్టు సమాచారం. దీంతో వీరు కూడా తమకెందుకీ తలనొప్పులు అని మిన్నకుండిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సెబ్‌లో చక్రం తిప్పుతున్న ఓ సీఐ
తనకున్న పలుకుబడితో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)లో చోటు దక్కించుకున్న ఓ ఎక్సైజ్ సీఐ మద్యం అక్రమ దందాలో చక్రం తిప్పుతున్నాడు. మద్యం దుకాణాల్లోని కొందరు సూపర్‌వైజర్లను తన కనుసన్నల్లో పెట్టుకొని ఎంచక్కా ‘బ్రాండ్’ బజాయిస్తున్నాడు. జిల్లాలో పాతుకుపోయిన ఈ సీఐ.. ఇప్పుడు ఏకంగా సెబ్‌లో పాగా వేసి తన అక్రమాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. వ్యవహారం బయటకు పొక్కినా స్థానిక సిబ్బంది ఎందుకొచ్చిన తలనొప్పులని మిన్నకుండిపోతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment