ఉల్లం‘ఘనం’
- ఏరులై పారుతున్న మద్యం
- విచ్చలవిడిగా నగదు పంపిణీ
- {పభుత్వ, ప్రైవేటు ఆస్తులపై యథేచ్ఛగా ప్రచారం
- నిబంధనలు బేఖాతర్
- పరిహాసానికి గురవుతున్న ‘కోడ్’
- పలుచోట్ల అధికారుల దాడులు
- రూ. 7.48 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: నగర ఎన్నికలంటేనే హైటెక్ ప్రచారం.. హంగు ఆర్భాటాలు.. హడావుడి.. అత్యధికం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఆశావహులు మొదలుకొని, ఖరారైన అభ్యర్థుల వరకు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. కాదేదీ ప్రచారానికనర్హం.. అన్న రీతిలో ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా, విచ్చలవిడిగా పార్టీల పబ్లిసిటీ సాగుతోంది. మద్యం ఏరులై పారుతోంది. నోట్ల కట్టల పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా వివిధ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు భవనాలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నాయి. నియమాలను ఉల్లంఘిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నియమించిన వివిధ బృందాలు, ఫ్లయింగ్‌స్క్వాడ్స్, ఎక్సైజ్, పోలీసు వర్గాలు ఇప్పటివరకు గుర్తించిన ఉల్లంఘనలు.. స్వాధీనం చేసుకున్న నగదునూ పరిశీలిస్తే కోడ్ ఎంతగా పరిహాసానికి గురవుతుందో అర్థమవుతుంది. అధికారులు నగరంలోని వివిధ ఘటనల్లో రూ.7,48,31,996 నగదు, రూ.81,05,175 విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
కార్వాన్ నియోజకవర్గం పరిధిలో 97 వాటర్ క్యాన్లు(20 లీటర్లవి) ఉన్న వాహనాన్ని ఆసిఫ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురాద్‌నగర్ డివిజన్‌లో ప్రజలకు సరఫరా చేసేందుకు వెళ్తున్న సదరు క్యాన్లపై ఏఐఎంఐఎం పార్టీ స్టిక్కర్లు, వాహనానికి ఆ పార్టీ నేతల ఫొటోలు, పార్టీ లోగో తదితరమైనవి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ భవనాలపై ముషీరాబాద్, ఖైరతాబాద్, కార్వాన్ నియోజకవర్గాల్లో 46 ప్రాంతాల్లో గోడలపై రాతలు, ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబిలీహిల్స్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలో 4583 పోస్టర్లు, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబిలీహిల్స్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో 290 బ్యానర్లు గుర్తించారు.
ఇతరత్రా మరో 4174 ప్రాంతాల్లో ఉల్లంఘనలు వెరసి మొత్తం 9093 ఉల్లంఘనలు గుర్తించారు.
వివిధ ప్రాంతాల అందం చెడగొడుతున్న 425 ప్రచారాలను గుర్తించారు.
ప్రైవేట్ ఆస్తులపై 49 భవనాల గోడలపై రాతలు, 1073 పోస్టర్లు, 101 బ్యానర్లు, ఇతరత్రా రూపాల్లో 1046 ప్రచారాలు వెరసి మొత్తం 2269 ఉల్లంఘనల్ని నమోదు చేశారు.
51 ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల అందం చెడగొడుతున్న ప్రచారాలను తొలగించారు.
ఇప్పటివరకు 4106 లెసైన్సున్న ఆయుధాలను వాటి యజమానులు డిపాజిట్ చేయగా, 68 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 199 ఆయుధాల లెసైన్సులు రద్దు చేశారు.
జిల్లా పరిధిలో 22 మద్యం దుకాణాలున్న ప్రాంతాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు.