సాక్షి, సిటీబ్యూరో: తన పేరు మార్క్ జాయ్ అంటూ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు... సెప్టెంబర్ 4 నుంచి వాట్సాప్‌లో చాటింగ్ చేశాడు... 21న బహుమతి పంపుతున్నానంటూ కొంత మొత్తం డిమాండ్ చేశాడు... 24న మరికొంత మొత్తం డిపాజిట్ చేయమన్నాడు.. మొత్తమ్మీద 20 రోజుల పరిచయంతో ఆ వృద్ధురాలి నుంచి రూ.1.17 లక్షలు దండుకుని మోసం చేశాడు. ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ రోడ్‌కు చెందిన ‘జేఎంకే’ ఏడేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న ఆమెకు ఫేస్‌బుక్‌లో ఖాతా ఉంది. సెప్టెంబర్ 1న ఈమెకు మార్క్ జాయ్ అనే ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అందులోని వివరాల ప్రకారం అతను లండన్‌లో ఉంటున్నట్లు ఉంది. ఈ రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఫేస్‌బుక్ స్నేహితులుగా మారిపోయారు.
సరిగ్గా నాలుగు రోజుల తర్వాత వాట్సాప్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న వీరు చాటింగ్ మొదలెట్టారు. హఠాత్తుగా మన స్నేహానికి గుర్తుగా ఓ గిఫ్ట్ పంపుతున్నానంటూ చెప్పిన అతగాడు దానిని అందుకోవాలన్నాడు. ఆపై సెప్టెంబర్ 21న ఖరీదైన వస్తువులతో కూడా ఆ గిఫ్ట్‌ప్యాక్ విమానాశ్రయంలో ఆగిపోయిందని, రిలీజ్ చేయించుకోవడానికి రూ.32 వేలు చెల్లించాలంటూ మెసేజ్ వచ్చింది. దీనిని నమ్మిన ఆమె సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టాంగ్‌కోయ్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసింది. అదే నెల 24న మరో మెసేజ్ పంపిన అతగాడు మరో రూ.85 వేలు డిమాండ్ చేయడంతో రాజ్ దాస్ పేరుతో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే కాల్ చేసిన మార్క్ ఈసారి ఏకంగా రూ.1.65 లక్షలు చెల్లించాలంటూ సూచించాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు మోసపోయినట్లు భావించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి బాధితురాలు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాలు నాగాలాండ్‌కు చెందినవిగా తేల్చారు. మొకోక్‌చుంగ్, దింబబూర్‌ల్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉన్న ఈ వివరాలతో పాటు సాంకేతిక ఆ«ధారాలను బట్టి నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలిని పరిచయం చేసుకునే సందర్భంలో మార్క్ తాను లండన్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. ఆపై గిఫ్ట్‌ను విమానంలో పంపిస్తున్నానని, ఎయిర్‌పోర్ట్‌లో ఆగాయని అన్నాడు. అయితే డబ్బు డిపాజిట్ చేయమన్న ఖాతాలు మాత్రం ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని బ్యాంకు శాఖల్లో ఉన్నవి ఇచ్చాడు. ఇలాంటి వివరాలు సరిచూసుకున్నా మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment