తడ: ఓ సైబర్ మాయగాడు ఏటీఎం కేంద్రం ముగ్గురు యువతులను మోసగించి రూ.68 వేల నగదు కాజేశాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. బాధితులు శనివారం ఉదయం పోలీసుకు ఫిర్యాదు చేశారు. విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చిన పీ ఉమ, వీ లక్ష్మి, ఎస్ వరలక్ష్మి శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరికి నాలుగు నెలలకు సంబంధించిన జీతాలు వారి వారి అకౌంట్లలో పడ్డాయి. ఆ డబ్బులను ఏటీఎం ద్వారా తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేసేందుకు తడలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు.
ఏటీఎం ద్వారా ప్రయత్నిస్తుండగా అదే సమయంలో ఏటీఎం లోపలే ఉన్న ఓ వ్యక్తి కలగజేసుకుని ఆపరేటింగ్ విధానాన్ని తప్పు బడుతూ వారి ఏటీఎం కార్డులను తీసుకుని పిన్ నంబర్ అడుగుతూ ఆపరేటింగ్ చేశాడు. నగదు పంపాల్సిన బ్యాంక్ వేరేది కావడంతో బదిలీ ఆపేసి ఖర్చులకు మాత్రం తలా రూ.2 వేలు చొప్పున డ్రా చేయించుకుని ఏటీఎం కార్డులు తీసుకుని హాస్టల్‌కు వెళ్లి పోయారు. హాస్టల్‌కి వెళ్లి కొద్ది సేపటికి డబ్బులు డ్రా అవుతున్నట్టు మెసేజ్‌లు రావడంతో ఆందోళన చెందిన యువతులు ఏటీఎంలు పరిశీలించగా అవి డూప్లికేట్ ఏటీఎం కార్డులని తేలింది.
వెంటనే తేరుకున్న యువతులు ఆటోలో సూళ్లూరుపేట కెనరా బ్యాంక్ వద్దకు వెళ్లి వెతగ్గా ఆ వ్యక్తి ఆచూకీ లభించలేదు. అనంతరం పరిశ్రమలో తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతని ద్వారా తడ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై శనివారం తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు వదిలి, అయిన వారిని వదిలి, సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగాలు చేసి కుటుంబ అవసరాల కోసం భద్రంగా దాచుకున్న జీతం మొత్తం మోసగాడి పాలు కావడంతో యువతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఏటీఎం సెంటర్లలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం, ఎవరు పడితే వారు గుంపులు గుంపులుగా ఏటీఎంల్లో చొరబడ్డా అడిగే నాథుడు లేకపోవడంతో మోసాలకు ఆస్కారాలు కలుగుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment