మోసగాడు దొరికాడు
మోసగాడు దొరికాడు
Published Tue, Mar 21 2017 10:58 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
- బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తామంటూ టోకరా
- బాధితుడి ఫిర్యాదుతో కేసును ఛేదించిన ఆదోని పోలీసులు
- నిందితుడి నుంచి రూ. 91 వేలు, సిమ్‌కార్డులు స్వాధీనం
ఆదోని టౌన్: అమాయక పేదలే అతని టార్గెట్. రుణాలు ఇప్పిస్తామంటూ పేపర్లలో ప్రకటనిలిచ్చి బురిడీ కొట్టించడంలో నేర్పరి. ఎంతో మందిని మోసం చేసిన ఓ సైబర్ నేరగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన సందీప్ కుమార్ అగర్వాల్ హైదరాబాద్‌లో ఉంటూ అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఫైనాన్స్ కంపెనీలలో లోన్‌లు మంజూరు చేయిస్తానని వివిధ దినపత్రికలలో క్లాసీఫైడ్ యాడ్స్ వేయించడం, ఎస్‌ఎంఎస్‌లు పంపడం, ఫోన్లతో అమాయక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించేవాడు. ఇందుకు వివిధ కంపెనీలకు చెందిన సిమ్ కార్డులను వినియోగించాడు.
ప్రియా ఫైనాన్స్, సుప్రియ, నిహారిక, లక్ష్మి తదితర ఫైనాన్స్‌ల నుంచి లోన్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికేవాడు. ఈ క్రమంలో కౌతాళం మండలం హాల్వి గ్రామానికి చెందిన సంపత్‌కుమార్‌కు సుప్రియ ఫైనాన్స్‌లో రూ. 5 లక్షలు ఎలాంటి పూచికత్తు లేకుండా లోన్ మంజూరు చేయిస్తానని చెప్పాడు. పలుమార్లు ఫోన్లలో మాట్లాడుతూ నమ్మించాడు. ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ మంజూరైనట్లు ప్రత్యేకంగా తాను తయారు చేసుకున్న ఫారంను చూపించాడు. దానిని నమ్మిన సంపత్‌కుమార్ వివి«ధ దశల్లో రూ.91 వేలు నేరగాడి అకౌంట్‌లో జమ చేశాడు. అయినా లోన్ మంజూరు కాకపోవడంతో అనుమానం కల్గిన బాధితుడు గత నెల 9వ తేదీన కౌతాళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
వల పన్ని పట్టుకున్నారు:
బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదోని తాలూకా సీఐ దైవప్రసాద్, ఎస్‌ఐ సుబ్రమణ్యం రెడ్డి, సిబ్బంది ఆనంద్, వలితో ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. 41 రోజులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడు ఉపయోగించిన ఫోన్ ఆధారంగా విచారణ చేయగా ఆచూకీ లభించలేదు. బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా విచారించగా ఏడు అకౌంట్లు ఉన్నట్లు తేలింది. అయినా నిందితుడిని పట్టుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో బాధితుడి నుంచే ఎర వేశారు.
లోన్ మంజూరవుతున్నట్లు వేరే నెంబర్‌తో నిందితుడి మళ్లీ బాధితుడికి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో అతనిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో లోన్ మంజూరుకు మరి కొంత నగదు అడగడంతో ఆదోనికి వస్తే ఇస్తానని బాధితుడు చెప్పాడు. మంగళవారం సందీప్ కుమార్ అగర్వాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే మాటు వేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 91 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
మాయమాటలు నమ్మొద్దు:
నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. ఈ–మెయిల్స్‌కు, సెల్‌కు మేసేజ్‌లు వస్తే లోన్ మంజూరైందని, ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తామని, సెల్‌ఫోన్లలో వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. ఎవరైనా ఎక్కడైనా మోసపోయినట్లయితే పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు. కేసును చాలెంజ్‌గా తీసుకొని ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
Advertisement