నిందితుడు మిర్జా అలీ బాయ్‌ను చూపిస్తున్న పోలీసు అధికారులు
గచ్చిబౌలి: చదివింది పదో తరగతి... కానీ వంద ఎకరాల్లో వెంచర్ వేయాలనేది అతడి స్వప్నం. దాని కోసం ఆరేళ్లుగా మోసాలు చేస్తూనే ఉన్నాడు. పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రైవేట్ సంస్థల నుంచి వందల కోట్ల రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి కోట్ల రూపాయలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు సదరు కేటుగాడిని కటకటాల వెనక్కి నెట్టారు.
ప్లాన్ ప్రకారం పక్కా మోసం
గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం .... వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మిర్జా అలీ బాయ్ అలియాస్ సమీర్ మిర్జా(36) గచ్చిబౌలిలోని పీఎస్‌ఆర్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్ నంబర్ 503లో 2020 డిసెంబర్‌లో సాహిత్య పేరిట మిస్టర్ బిల్డర్ రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించాడు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు ఇప్పిస్తానని ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో ప్రకటనలు గుప్పించాడు. ఈ ప్రకటనలు చూసిన అనేక మంది లోన్ కోసం మిర్జా అలీ బాయ్‌ని సంప్రదించారు. ఈ క్రమంలోనే కామినేని హాస్పిటల్ పీఆర్‌ఓ, యునైటెడ్ స్టీల్ ఎలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ మోహన్ రావు గచ్చిబౌలి కార్యాలయానికి శశిధర్ అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేసేందుకు లోన్ కావాలని మిర్జా అలీ బాయ్‌ని సంప్రదించాడు.
ప్రైవేట్ సంస్థల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా తన వద్ద రాజకీయ నాయకుల బ్లాక్ మనీ ఉందని అలీబాయ్ నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజుల చెల్లించాలని చెప్పడంతో ఆర్‌టీజీఎస్ ద్వారా జనవరి 12న రూ.1.10 కోట్లు, జనవరి 30న రూ.1,71 కోట్లు మొత్తం రూ.2,80 కోట్లు పంపారు. నెలలు గడుస్తున్నా లోన్ రాకపోవడంతో అనుమానం వచ్చి మిర్జా అలీ బాయ్‌ని నిలదీయడంతో మార్చి 19న మూడు కోట్లకు చెక్‌లు ఇవ్వగా 26న బౌన్స్ అయ్యాయి.
తిరుమలగిరికి చెందిన దినేష్ కుమార్ వ్యాపారం నిమిత్తం రూ.10 కోట్ల లోన్ కావాలని సంప్రదించగా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట మార్చి 23న రూ.35.50 లక్షలు, మార్చి 29న రూ.35.50 లక్షలు తీసుకున్నాడు. కృష్ణా జిల్లాకు చెందిన రైస్ మిల్లు ఓనర్ ప్రభాకర్‌రావు రూ.8 కోట్ల కోసం సంప్రదించగా, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.30 లక్షలు తీసుకున్నాడు. లోన్ మధ్యలోనే ఆగిందని చెప్పి చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. మోసపోయామని గ్రహించిన బాధితులు గచ్చి బౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదే తరహాలో 18 మందిని మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తొమ్మిది మందికి డబ్బులు చెల్లించాలని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరో ఆరుగురి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు, బెంజ్, స్విఫ్ట్ కార్లు, కంపెనీ డాక్యుమెంట్లు, లోన్ అప్లికేషన్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్, నకిలీ స్టాంపులు, ఆధార్, పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 406,420,506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
( చదవండి: బెంగళూరు డ్రగ్స్ కేసు: ఆ గుట్టంతా జుట్టులోనే..! )
Comments
Please login to add a commentAdd a comment