ఫోటోలు, వీడియోలు షేరింగ్ కోసం ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. నచ్చినవాటిని పోస్ట్ చేస్తూ, నలుగురి మెప్పు పొందేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. షాపింగ్ కోసమైతే ఇప్పుడు ఇదో అతిపెద్ద వేదిక అని కూడా చెప్పవచ్చు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉండగా వీరిలో 30 శాతం మంది 18– 24 ఏళ్ల మధ్య ఉంటే, 32 శాతం మంది 25–32 ఏళ్ల మధ్య వారున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నవారు అందులోని గ్రామర్ గురించి కూడా తెలుసుకుంటే మోసాల బారినపడకుండా ఉండగలం.
ప్రయోజనాలు మంచివే..
∙బ్రాండ్‌లపట్ల అవగాహనను పెంచుతుంది. కస్టమర్‌లో నమ్మకాన్ని పెంచుతుంది.
∙అభిమానులను సంపాదించుకోవాలన్నా, కస్టమర్లను చేరుకోవాలన్నా సత్వర మార్గం అందుకు తగిన ఫొటో లేదా వీడియోను షేర్ చేయడం. ఇది చాలా సులువైన ప్రక్రియ.
∙నాణ్యమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం, ప్రశ్నలు అడగడం, ఫీడ్‌బ్యాక్ అందించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించవచ్చు. ఇది ఒక ప్రచార సాధనం కూడా. ఉత్పత్తులు లేదా సేవల కోసం షాపింగ్ చేయడానికి ఫాలోవర్లు, వెబ్‌సైట్ విజిటర్స్ పెరుగుతారు.
∙కొత్త కస్టమర్‌లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రచారాలను సృష్టించుకోవచ్చు.
∙ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.
∙వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి, మీరు ట్రోల్ చేయబడే విధంగా వ్యక్తిగత కథనాలు, అభిప్రాయాల వ్యక్తీకరణలు, స్విమ్‌సూట్‌లలో ఉన్న ఫొటోలు, వీడియోలు వంటివి లేకుండా చూసుకోవడం ముఖ్యం.
∙మీరు షేర్ చేసే ఫొటోలు, వీడియోలపై వాటర్‌మార్క్‌లను ఉపయోగించండి.
∙మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే మీ అకౌంట్ కనిపించేలా సెట్టింగ్ చేసుకోవడం మంచిది.
హద్దులను సెట్ చేయండి
∙భవిష్యత్తులో ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచే వ్యక్తిగత కథనాలను ఎప్పుడూ షేర్ చేయవద్దు.
∙మనోభావాలను దెబ్బతీసే వాటిని ఎప్పుడూ పోస్ట్ చేయవద్దు
∙జాత్యహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలను నివారించండి.
ఇలా సురక్షితం
∙మీ చిరునామా, ఫోన్‌నంబర్, వ్యక్తిగత వివరాలను మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రచురించవద్దు. ఎందుకంటే ఇది వాణిజ్య, సామాజిక ప్రయోజనాల కోసం వినియోగించబడుతుంది కనుక యాప్స్‌కి ఇవ్వబడిన యాక్సెస్ అధికారాలు మీకు నిజంగా అవసరమని నిర్ధారించుకున్నాకే ఓకే చేయడం మంచిది.
∙అవసరం లేని యాప్‌లను అలాగే ఫాలోవర్స్‌ని కాలానుగుణంగా తొలగించడం మేలు.
∙మీ ఫోన్ లో జిపిఎస్, బ్లూటూత్, పాస్‌వర్డ్‌లు, పిన్ లను సెట్ చేయండి.
∙యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలి.
∙ఆఫ్‌లైన్, ఆన్ లైన్ చర్యలకు, వ్యక్తీకరణలు ఒకే విధంగా పరిగణించాలి.
డేటా రక్షణ
∙పెయిడ్ అప్లికేషన్ లను ఉపయోగించండి. అవి సాధారణంగా మాల్వేర్, ట్రాకర్‌లను బ్లాక్ చేస్తాయి.
∙పాస్‌వర్డ్‌లు, ఇ–మెయిల్, ఆన్‌లైన్ చెల్లింపులకు రెండు రకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. బ్యాంకు ఫోన్ నంబర్–సోషల్ మీడియా ఫోన్ నంబరు విడివిడిగా వాడటం ఉత్తమం.
ప్రైవేట్‌గా ఉండాలంటే..
నేటి ప్రపంచంలో సోషల్ మీడియా లేని జీవితం అసంపూర్ణం అని తెలిసిందే. అయినప్పటికీ, చెడు చేసే ఉద్దేశాలు ఉన్నవారి కారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉండటమే పెద్ద లోపంగా భావిస్తున్నారు. అంతేకాదు, మోసగాళ్లను ఎదుర్కోవటానికి మార్గాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
మోసాలు ఇవీ..
∙నకిలీ ఖాతాలను సృష్టించడం, నకిలీ ప్రకటనలను ప్రచురించడం ఇక్కడ చాలా సులభం. స్కామర్లకు ఇదో వరంలా మారింది. వారు చట్టబద్ధమైన బ్రాండ్‌ల నుండి ఉత్పత్తికి సంబంధించిన అన్ని ఫొటోలను దొంగిలిస్తారు. ఖాతాను సృష్టించిన తర్వాత కేవలం రెండు నిమిషాల్లో వారి నకిలీ ప్రకటనలతో ముందుకు వస్తారు.
∙ఇన్‌స్టాగ్రామ్ ప్రధానంగా నకిలీ/ప్రతిరూపం/సెకండ్ కాపీ వెబ్‌సైట్‌లకు ఒక మార్గంలా ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించే బదులు, నకిలీ వెబ్‌సైట్‌ల సృష్టికి దారి తీస్తారు. వాటి గురించి కొనుగోలుదారుకు తెలియదు.
కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టే సోషల్ మీడియా వల్ల ప్రయోజనాలు, సమస్యలూ రెండూ ఉన్నాయి. ప్రయోజనకరంగా మార్చుకోవడం, సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది.
షాపింగ్ స్కామ్‌లూ ఎక్కువే!
∙బాధితులు ఇన్ స్టాగ్రామ్‌లో పెద్ద బ్రాండ్ మొబైల్‌లు, వాచీల కోసం వెతుకుతారు. అవి సాధారణంగా క్లోన్ చేయబడిన లేదా కాపీ ఉత్పత్తులతో అకౌంట్లలో కనిపిస్తాయి. వీటిని ఎంచుకున్నప్పుడు స్కామర్‌లు తక్షణమే ప్రతిస్పందిస్తారు. ప్రొడక్ట్ ఫొటోలు /వీడియోలను పంపుతారు. బాధితులు అడ్వాన్స్‌లో 25% బుకింగ్ మొత్తంగా చెల్లిస్తారు. స్కామర్‌లు బుకింగ్‌ల నకిలీ స్క్రీన్ షాట్‌లను పంచుకుంటారు, ట్రాకింగ్ ఐడీలను అందిస్తారు.
ఆ తర్వాత, డెలివరీ రోజున మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని అభ్యర్థిస్తారు. డెలివరీ రోజున, డెలివరీ చేసే వ్యక్తితో ఓటీపీని షేర్ చేయమని కోరుతూ మెసేజ్ వస్తుంది. చెల్లించిన తర్వాత, కొంతమంది స్కామర్‌లు నాణ్యత లేని కాపీ ప్రొడక్ట్స్‌ను పంపిస్తారు. కొంతమంది స్కామర్‌లు అసలే ప్రొడక్ట్స్‌ని పంపించకుండా అకౌంట్‌ను క్లోజ్ చేస్తారు.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment