ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు | 39percent Indian Families Claim To Be Victim Of Online Financial Fraud | Sakshi
Sakshi News home page

ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు

Published Thu, May 4 2023 1:47 AM | Last Updated on Thu, May 4 2023 10:58 AM

39percent Indian Families Claim To Be Victim Of Online Financial Fraud - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్‌ సర్కిల్స్‌ విడుదల చేసింది.

► 23 శాతం మంది క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు.
► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్‌సైట్ల ద్వారా మోసపోయారు.
► 10 శాతం మంది వెబ్‌సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు.  
► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది.

► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.
► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు.
► సంబంధిత ప్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు.

► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు.

► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు.  
► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు.
► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement