ఖాతాదారుల నుంచి నెలనెలా ఆటోమేటిక్‌గా డబ్బు కట్టింగ్‌లు అయ్యే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఖాతాదారు నుంచి అదనపు ధృవీకరణ తర్వాతే డబ్బులు కట్ అవుతాయని పేర్కొంది. ఇందుకోసం బ్యాంకుల తరపు నుంచి ఖాతాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని పేర్కొన్న ఆర్బీఐ.. తొలి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయబోతోంది.
ఆర్బీఐ కొత్త రూల్.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్(AFA). యూజర్ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడం కుదరదు. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీలు అయిపోగానే.. చాలామంది యూజర్లకు ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి ప్యాకేజీ రెన్యువల్ అవుతుంటుంది. తాజా నిబంధనల ప్రకారం.. ఇక మీదట అలా కుదరదు.
అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేయనుంది. హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాకింగ్ దొంగతనాలను నిలువరించేందుకు ఏఎఫ్‌ఏ నిబంధనను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆటోమేటిక్‌గా పేమెంట్ డిడక్ట్ అయ్యే సమయంలో మోసాలకు, ఆన్‌లైన్ దొంగతనాలకు ఆస్కారం ఉంది. అందుకే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ పద్దతి ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. కార్డులతో పాటు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI), ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) ద్వారా చెల్లింపులకు వర్తించనుంది. క్లిక్: Cryptocurrency- ఆర్బీఐ ఆందోళన
ఇక ఏఎఫ్‌ఏ పద్దతిలో చెల్లింపుల ద్వారా భద్రతపరమైన డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో, మొదటి ట్రాన్‌జాక్షన్, ప్రీ ట్రాన్‌జాక్షన్ నోటిఫికేషన్, విత్‌డ్రా కోసం ఏఎఫ్‌ఏ తప్పనిసరని, ఇదంతా యూజర్ భద్రత కోసమేనని ఆర్బీఐ అంటోంది. ఈ రూల్‌అమలులోకి రాగానే.. బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తాయని వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో అమలు చేయాలనుకుంటున్న AFA పద్దతిని.. త్వరలో మిగతా అంశాల్లోనూ విస్తరించే విషయం కేవలం పరిశీలనలో మాత్రమే ఉందని ఆర్బీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment